
జనగణన, కుల గణనపై కొత్త రాజకీయ పోరు..
మహిళా రిజర్వేషన్ అమలులో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కలకలం..
మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. 2027 జనాభా లెక్కలతో మహిళా రిజర్వేషన్‌ను అనుసంధానం చేయకుండా వేరు చేయాలన్న కేంద్ర ప్రణాళికపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి వెనుక “రహస్య ఎజెండా” ఉందని ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం (Nari Shakti Vandan Adhiniyam) అమలును ఆలస్యం చేయడానికి ఈ మార్పులు చేస్తున్నారని అన్నారు.
అసలు వివాదం ఏమిటి?
2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, ఈ కోటా అమలు- తాజా జనగణన, దాని ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన, తర్వాత మాత్రమే అమలులోకి రావాలి. అయితే, 2027 జనగణనలో కుల గణన కూడా జరగనుంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్‌ను ఆ జనగణన నుంచి వేరు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీనివల్ల 2029 ఎన్నికల ముందు రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపక్షాల అనుమానాలు..
ప్రతిపక్షాలు మాత్రం దీనిని వేరే కోణంలో చూస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలు మూడు ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి
కుల గణనను ఆలస్యం చేసే ప్రయత్నం ..
2027 జనగణనలో కుల గణన ఉంటే, ఓబీసీ వర్గాల అసలు జనాభా బయటపడుతుంది. దాన్ని తప్పించుకోవడానికే ఈ నిర్ణయం అంటున్నారు.
ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడం..
మహిళా రిజర్వేషన్‌లో “కోటాలో కోటా”గా ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
2011 డేటా వినియోగంపై విమర్శలు..
2027 డేటా బదులుగా 2011 జనగణన గణాంకాల ఆధారంగా పునర్విభజన చేయాలన్న కేంద్ర ఆలోచనపై అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్జేడీ నాయకులు కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓబీసీలకు నిజమైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్రం వైఖరి..
కేంద్ర ప్రభుత్వం మాత్రం వేరే వాదనను ముందుకు తెస్తోంది. మహిళా రిజర్వేషన్‌ను త్వరగా అమలు చేయాలంటుంది. జనగణన, పునర్విభజన కోసం వేచి ఉంటే మరింత ఆలస్యం అవుతుంది. అందుకే ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నామని చెబుతోంది. అయితే, కుల గణన అవసరం లేదని కాదు, కానీ అది పూర్తవ్వడానికి సమయం పడుతుందని పేర్కొంటోంది.
రాజకీయంగా పెరుగుతున్న ఉద్రిక్తత..
ఈ అంశం కేవలం చట్టపరమైనది కాదు పూర్తిగా రాజకీయంగా మారింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi), అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వంటి నేతలు ఇప్పటికే కుల గణనను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చారు.
ప్రతిపక్షం అభిప్రాయం ప్రకారం..
కుల గణన డేటా వెలువడితే ఓబీసీలు, దళితులు, గిరిజనుల వాస్తవ పరిస్థితి బయటపడుతుంది. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్రం ఈ ప్రక్రియను ఆలస్యం చేయాలని చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ముందున్న పరిణామాలు
ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఏప్రిల్ మధ్యలో జరగనున్న సమావేశాల్లో ఈ సవరణలు తీసుకురావచ్చని సమాచారం. ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతే, కానీ అది న్యాయంగా, సమానంగా అమలవ్వాలని కోరుతున్నాయి.
కీలక ప్రశ్న..
ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న ఇదే. మహిళా రిజర్వేషన్ వేగంగా అమలు చేయాలన్న కేంద్ర ప్రయత్నం నిజంగానే పరిపాలనా అవసరమా? లేదా కుల గణన ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న రాజకీయ నిర్ణయమా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశముంది.

