
Parliament | S.I.Rకు వ్యతిరేకంగా ఈసీపై ప్రతిపక్షాల నిరసన..
బీహార్ రాష్ట్రంలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో రాహుల్..
I.N.D.I.A కూటమి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం(ECI)పై పోరును తీవ్రం చేశాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రంలో ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటు విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఫొటోలు, "ఓటు చోర్", "సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్" అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ నిరసన ప్రదర్శకు కాంగ్రెస్(Congress) చీఫ్ ఖర్గే(Kharge) నాయకత్వం వహించగా.. ఎంపీలు అఖిలేష్, ప్రియాంక పాల్గొన్నారు.
సుమారు 63 లక్షల ఓటర్ల తొలగింపు..
ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 63 లక్షల ఓటర్లను అనర్హులుగా గుర్తించి, వారి పేర్లను ఓటరు లిస్టు నుంచి తొలగించారు. వీరిలో కొంతమంది చనిపోయిన వారు, కొంతమంది పూర్తిగా వలస వెళ్లిపోయారని, మరికొంత రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని ఈసీ వివరణ ఇచ్చుకుంది.
అయితే SIRపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని I.N.D.I.A కూటమి పార్టీలు పట్టుబడుతున్నాయి. జూలై 21న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ తప్ప మిగతా అంశాల మీద పెద్దగా చర్చ జరగలేదు.
సీఈసీ విలేఖరుల సమావేశం నిర్వహించాక.. విపక్ష ఎంపీలు తమ స్వరాన్ని పెంచాయి. తాము లేవనెత్తిన ఏ ప్రశ్నకూ సీఈసీ నుంచి సరైన సమాధానం లేదని ప్రతిపక్షాల ఆరోపణ.