Parliament | నేడు లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
x

Parliament | నేడు లోక్‌సభలో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లు

గత వారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే.


లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంటు దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును ప్రవేశపెడతారని భావిస్తున్నారు. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును తర్వాత పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపాల్సిందిగా మేఘ్‌వాల్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించనున్నారు. బిల్లు ప్రవేశపెట్టే సమయానికి లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌, శివసేన పార్టీలు తమ పార్టీ సభ్యలకు ఇప్పటికే విప్‌ జారీ చేశాయి.

ఇతర బిల్లులు..

కేంద్రపాలిత ప్రాంతాలయిన జమ్మూ - కాశ్మీర్, పుదుచ్చేరి, ఢిల్లీ (NCT)లో కూడా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు - 2024ను కూడా మంత్రి ప్రవేశపెడతారు. వివిధ పార్టీల ఎంపీల బలం ఆధారంగా ఉమ్మడి ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారు.

కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ

అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తుందని పార్టీనేత ఒకరు చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి దశలవారీగా నిర్వహించాలని సిఫార్సు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిగువసభకు హాజరయ్యే అవకాశం ఉంది.

గత వారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

కోవింద్ నేతృత్వంలోని కమిటీ చెప్పిందేమిటి?

పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ గురించి మాజీ రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ.. ఈ విధానానికి 32 పార్టీలు మద్దతు ఇచ్చాయని, 15 పార్టీలు ఇవ్వలేదని చెప్పారు. దేశంలో 1951, 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.

Read More
Next Story