జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
x

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..

JKNC ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం శ్రీనగర్‌లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


JKNC ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన మంత్రిమండలితో J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు.

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత జమ్మూ, కాశ్మీర్‌లో ఎన్నికైన మొదటి ప్రభుత్వం కూడా ఇదే.

జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడయిన ఒమర్ 2009 నుంచి 2015 వరకు జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి NDA ప్రభుత్వంలో 2001-2002 మధ్య విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా మూడు పర్యాయాలు J&K ముఖ్యమంత్రిగా ఉన్నారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)తో కలిసి నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూ కాశ్మీర్ 2018 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 48 సీట్లు గెలుచుకోగా, ఎన్‌సీ 42 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకున్నాయి.

మనం చేయాల్సింది చాలా ఉంది: ఒమర్

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని తన తాత షేక్ మహ్మద్ అబ్దుల్లా సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు తమ ప్రభుత్వం చేయవలసింది చాలా ఉందన్నారు.

“మనం చేయాల్సింది చాలా ఉంది. ఇది తమ ప్రభుత్వమని ప్రజలకు నమ్మకం కల్పించాలి. జనం సమస్యలు వారికి వినిపించలేదు. కాని ఇప్పుడు ప్రజల ఇబ్బందులు, సమస్యలపై స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని అన్నారు.

“గతంలో పూర్తిగా ఆరేళ్లపాటు పనిచేసిన చివరి ముఖ్యమంత్రిని నేనే. ఇప్పుడు నేను J&K కేంద్రపాలిత ప్రాంతానికి మొదటి ముఖ్యమంత్రిని అవుతున్నా. కేంద్రపాలిత ప్రాంతానికి సీఎం కావడం పూర్తిగా భిన్నమైన విషయం. అయితే కేంద్రపాలిత ప్రాంతం హోదా తాత్కాలికమేనని నేను ఆశిస్తున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వ సహకారంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. J&Kకి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికే ఇది ఉత్తమ మార్గం. ’’ అన్నారు.

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా బ్లాక్‌ నాయకులు చాలా మంది హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌ పవార్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ తాత్కాలిక నేత ప్రకాశ్‌ కారత్‌ తదితరులు హాజరయ్యారు. తమిళనాడు నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరయిన వారిలో ఉన్నారు.

Read More
Next Story