బెంగాలీ భాషలో US అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ పేపర్లు..
x

బెంగాలీ భాషలో US అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ పేపర్లు..

“బ్యాలెట్ పేపర్లను బెంగాళీ భాషలో ముద్రించడం వల్ల భారతీయులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు.” - డాక్టర్ అవినాష్ గుప్తా


అమెరికా అధ్యక్ష పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. 47వ దేశాధ్యక్షుడిని అమెరికన్లతో పాటు అక్కడ నివాసం ఉంటున్న భారతీయులు ఎన్నుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల కోసం ఇంగ్లీష్‌తో పాటు మరో నాలుగు భాషల్లో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఆ జాబితాలో మన దేశ భాష బెంగాలీ కూడా ఉంది.

“మేము ఇంగ్లీషుతో పాటు మరో నాలుగు ఆసియా భాషలు చైనీస్, స్పానిష్, కొరియన్, బెంగాలీలో బ్యాలెట్ పేపర్లు ముద్రించాం” అని NYC బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ చెప్పారు. బెంగాలీ భాషలో బ్యాలెట్ రూపకల్పన.. భారతీయ సంస్కృతికి US ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మన భారతీయుల పట్ల అమెరికన్లకు ఉన్న విలువను కూడా సూచిస్తుంది.

భారతీయులను ఆకర్షించేందుకు..

టైమ్స్ స్క్వేర్‌లోని ఓ స్టోర్‌లో బెంగాలీ మూలాలున్న సుభేష్‌ సేల్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. క్వీన్స్ ప్రాంతంలో నివసిస్తున్న తన తండ్రి ఓటు వేయడానికి బెంగాలీ భాషలో ఉన్న బ్యాలెట్ పేపర్ దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. “నాలాంటి వారికి ఇంగ్లీషు తెలుసు. కానీ మా కమ్యూనిటీలో చాలా మంది వారి మాతృభాష బెంగాలీ మాట్లాడతారు. వారికి ఆంగ్లం రాదు. బెంగాలీ బ్యాలెట్ పేపర్‌ని చూసి మా నాన్న సంతోషం వ్యక్తం చేశారు." అని సుభేష్ చెప్పారు.

“బ్యాలెట్ పేపర్లను బెంగాళీ భాషలో ముద్రించడం వల్ల భారతీయులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు.”అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అవినాష్ గుప్తా పేర్కొన్నారు.

మొదటసారి 2013లో..

న్యూయార్క్‌ క్వీన్స్ ప్రాంతంలోని దక్షిణాసియా వాసుల వారి కోసం మొదటిసారి 2013లో బెంగాలీ భాషలో బ్యాలెట్‌ పేపర్ రూపొందించారు. 1965 ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం బెంగాలీ భాషలో బ్యాలెట్ పేపర్ ఉండాలని ఫెడరల్ ప్రభుత్వం ఆదేశించిన రెండేళ్ల తర్వాత అమల్లోకి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇండియా, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల నుంచి వచ్చిన వారిలో బెంగాలీ భాష ఎక్కువగా మాట్లాడతారు.

Read More
Next Story