స్కూల్ ఫీజుల పెంపుపై ఢిల్లీ సీఎం ఏమన్నారంటే..
x

స్కూల్ ఫీజుల పెంపుపై ఢిల్లీ సీఎం ఏమన్నారంటే..

ఫీజు కోసం తల్లిదండ్రులను వేధిస్తే నోటీసులు తప్పవన్న రేఖా గుప్తా..


ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) సీరియస్ అన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు(School fee) పెంచితే ఊరుకునేది లేదని ప్రైవేటు స్కూళ్ల(Private Schools)ను హెచ్చరించారు. ఫీజు చెల్లించలేదని విద్యార్థులను క్లాస్‌లోకి అనుమతించకపోయినా.. ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలను పాటించక స్కూళ్లపై తమ వైఖరి కఠినంగా ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు.. ఫీజు చెల్లించలేదని మోడల్ టౌన్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌ విద్యార్థులను బహిష్కరించిందని ఆమెకు ఫిర్యాదు అందింది. దీనిపై ఆమె ఎక్స్ వేదికగా తక్షణమే స్పందించారు. తమ ప్రభుత్వం పారదర్శకతకు, విద్యా రంగంలో పిల్లల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

"ఈ రోజు మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూల్‌పై నాకు ఫిర్యాదు అందింది. తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని, ఫీజు కట్టని విద్యార్థులను క్లాస్‌లోకి అనుమతించడం లేదని కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ఏకపక్షంగా ఫీజులు పెంచినట్లు నా దృష్టికి వచ్చిన పాఠశాలలకు నోటీసులు జారీ చేయమని చెప్పాం. వారు గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవు" అని పేర్కొన్నారు.

ఆప్(AAP) ఆరోపణ.. బీజేపీ(BJP) వాదనేంటి?

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ప్రైవేటు పాఠశాలల ఫీజులు పెరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) ఆరోపించారు. "అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ అరోరా బీజేపీ ఆఫీస్ బేరర్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి తరపున చురుకుగా ప్రచారం చేశారు. కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన ఫీజుల పెంపు వార్తలు రావడం ప్రారంభించాయి" అని పేర్కొన్నారు.

సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యలకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా(Virendra Sachdeva) స్పందించారు. ఢిల్లీలోని 1,575 ప్రైవేట్ పాఠశాలల ఖాతాలను ఆడిట్ చేయడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని ఆరోపించారు.

Read More
Next Story