
‘ప్రతి వేదికపై మా గొంతు వినిపిస్తాం’
వయనాడ్ బాధితుల రుణాలను మాఫీ చేయడం కుదరదని కేంద్రం స్పష్టీకరణ - అండగా నిలుస్తామని ప్రియాంక హామీ
‘‘వయనాడ్ (Wayanad) బాధితులకు మంజూరు చేసిన రుణాలను రద్దు చేయడం కుదరదు. అవసరమైతే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం రీ షెడ్యూల్ చేయవచ్చు’’ అని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు స్పష్టం చేసింది. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో హైకోర్టు స్వయంగా పిల్ దాఖలు చేసింది. వయనాడ్ బాధితుల రుణాలను మాఫీ చేయవచ్చా? అని అడిగిన ప్రశ్నకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. గత ఏడాది ఆగస్టు 19న కేరళ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశం జరిగిందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరైన ఈ సమావేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మంజూరు చేసే రుణాలు చెల్లింపులో ఆర్‌బీఐ మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగిందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) స్పందించారు. బాధితుల రుణాలను మాఫీ చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. "వయనాడ్ బాధితులు ఇళ్ళు, భూమి, జీవనోపాధి..అన్నీ కోల్పోయారు. అయినా కూడా ప్రభుత్వం రుణ మాఫీకి నిరాకరిస్తుంది. పైగా రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెబుతోంది. ఇది ఉపశమనం కాదు. ద్రోహం,’’ అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో మండిపడ్డారు.
కేంద్ర ఉదాసీనతను తాను తన పార్టీ ఖండిస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు ప్రతి వేదికపైనా మా గొంతు వినిపిస్తాం" అని పేర్కొన్నారు.
గత ఏడాది జూలై 30న కేరళలోని ముందక్కై, చూరల్‌మల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం సంభంవించింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. 32 మంది గల్లంతయ్యారు.