బెంగాల్ తెర మీద మరో ఫైర్ బ్రాండ్...
మమతా, మహువా... ఇపుడు బెంగాల్ తెరమీద మరొక ఫైర్ బ్రాండ్ మహిళ ప్రత్యక్షం. సర్వత్రా ఆమె పేరే , కమ్యూనిస్టులను గట్టెక్కించాల్సిందిపుడు ఆమెయే, ఎవరామె, ఏమా కథ...
కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం తన ప్రభావం చూపలేనంతగా దిగజారీ పోయింది. మరోవైపు బీజేపీ రోజురోజుకీ ఎదుగుతోంది. సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టిపెడుతోంది. ఇక బెంగాల్ లో కమ్యూనిస్టు పార్టీ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఓ యువ నాయకురాలు తన ప్రసంగాలతో పార్టీ క్యాడర్ ను .. ప్రజలను తనవైపు తిప్పుకుంటోంది. ఎవరా నాయకురాలు? ఏంటా వివరాలు..
మీనాక్షి ముఖర్జీ.. లేటెస్ట్ బెంగాల్ ఫైర్ బ్రాండ్. దశాబ్దక్రితం అధికారం కోల్పోయిన సీపీఎంకి ఆమె ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆవేశపూరిత ప్రసంగాలతో పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపుతూ ముందుకు సాగుతున్నారు. మీనాక్షి దూకుడు చూసి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం మమతా బెనర్జీ కి ఉన్నంత క్రేజ్ మీనాక్షి ముఖర్జీ కి కూడా వస్తుుందని లెప్ట్ నాయకత్వం లెక్కలు వేస్తోంది.
సీపీఎం పార్టీ చేపట్టిన ఇన్సాఫ్ యాత్ర ముగింపు సభ సందర్భంగా కోల్ కత్త లో జరిగిన సభలో మీనాక్షి పేరు మారుమోగిపోయింది. తన ప్రసంగం ప్రారంభం కావడానికి కంటే ముందు దాదాపు అరనిమిషం పాటు అభిమానులు అరుపులు, కేకలతో కోలాహాలం సృష్టించారు. అంతకుముందు పార్టీ నిర్వహించిన 50 రోజుల ప్రజాయాత్రలో డీవైఎఫ్ఐ తరఫున మీనాక్షి ముఖర్జీ పాల్గొన్నారు.
బిమన్ బోస్ లాంటి అగ్ర నాయకులు సైతం మీనాక్షిని "కెప్టెన్ గా" అభివర్ణిస్తున్నారు. నిజానికి లెప్ట్ పార్టీకి చాలాకాలంగా నాయకత్వం ప్రధాన సమస్యగా ఉంది. బుద్దదేవ్ భట్టాచార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీలో ఇంకా పేరుమోసిన, ప్రజాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడంతో ఓట్ల వేటలో ఆపార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఆ నాయకత్వం పూరించే నాయకులు ఇప్పుడు దొరికారని పార్టీ ఆనందపడుతోంది.
మీనాక్షి మాత్రం నేను కెప్టెన్ ను కాను అంటోంది." నేను కెప్టెన్ కాను, నన్ను ఎలా ఎవరైనా అలా అంటే మన పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్దాంతాలు, సూత్రాలు అన్ని త్యజించిన వాళ్ల మవుతాం" అని చెబుతోంది. " మనం కటౌట్లు, ఏక వ్యక్తి ఆరాధన, విగ్రహరాధన వంటి వాటికి వ్యతిరేకం, అసలు అది మనసంస్కృతి కాదు "అని జవాబిస్తోంది. పార్టీలలో ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు నాయకుడిగా చూడలేదని, కెప్టెన్ అని ఎవరినైనా అంటే అది మీనాక్షిని అవమానించినట్లే అని కొంతమంది లెప్ట్ నాయకుల వాదనగా ఉంది.
"సీపీఎం చేపట్టిన సామూహిక సంపర్క్ కార్యక్రమం యువతరాన్ని నాయకత్వంగా చూపెట్టే ప్రయత్నం ప్రారంభించినట్లు అయింది. రాష్ట్రంలో ఉన్న టీఎంసీని, దేశంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది" అని కలంతర్ లో పనిచేసిన సీపీఐ నాయకుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలు చెప్పే ఎండీ సాదుద్దీన్ అంటున్నారు.
కొత్త నాయకత్వంతో మార్పు మొదలు
2022లో రాష్ట్ర కార్యదర్శిగా మహ్మద్ సలీం వచ్చారు. వచ్చిరాగానే పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారు. 80 సభ్యులున్న రాష్ట్ర కమిటీలో 24 మంది కొత్తవారికి స్థానం కల్పించారు. " పార్టీలో యువనాయకులు ఎదగడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నాం" అని సీపీఎం రాష్ట్ర కారదర్శి సలీం చెబుతున్నారు. అలాగే పార్టీ భవిష్యత్ రోడ్ మ్యాప్ ను వివరించే ప్రయత్నం చేశారు.
మీనాక్షిని లాంటి కొత్తతరం నాయకులు బాధ్యతలు అప్పగించే పనిని మొదలు పెట్టామని సీపీఎం పార్టీ విభాగం అంటోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీని ఎదుర్కోవడానికి మీనాక్షి ముఖర్జీ లాంటి నాయకులు పార్టీకి బలం అవుతారని లెప్ట్ నాయకత్వం నమ్మకంగా ఉంది. బెంగాల్ లో దాదాపు 48 శాతం మహిళా ఓటర్లు ఉన్నందును ఆమె అదనపు బలం అవుతుందని విశ్వసిస్తున్నారు.
ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడమే అసలు సవాల్. మీనాక్షి కూడా ఇదే చెబుతోంది. "మాదీ పునరాగమన పోరాటం. ఇదీ టీ20 గేమ్ కాదు.. టెస్ట్ మ్యాచ్ .. ఒక్క ఆటగాడు మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చగలడు. మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఏం చేసాడో గుర్తుందా" అని పోరాటాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది.