
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
‘‘డాక్టర్ ను విడుదల చేయకపోతే నిరవధిక సమ్మె చేస్తాం’’
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చింద్వారా యూనిట్ హెచ్చరిక
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో పిల్లలకు కోల్డ్రీఫ్ దగ్గుమందు(సిరప్) సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనీని అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చింద్వారా యూనిట్ ఖండించింది. డాక్టర్ సోని విడుదల చేయకపోతే సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనిట్ అధ్యక్షురాలు కల్పనా శుక్లా హెచ్చరించారు.
మరో వైపు పిల్లల మరణాలను సీరియస్ గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసును విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
దాదాపు నెల రోజులుగా పిల్లలపై ప్రతికూల ప్రభావాలు చూపినప్పటికీ డాక్టర్ ప్రవీణ్ అవేవీ పట్టించుకోకుండా సిరప్ ను కొనసాగించాలని సూచించాడు. దీనితో 14 మంది పిల్లలు మూత్ర పిండాల వైఫల్యంతో మరణించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ నిరసనలు..
ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచాలని కోరుతూ సోమవారం నుంచి నిరసనలకు పిలుపునిచ్చింది.
పిల్లలు మరణిస్తున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. బాధిత కుటుంబాలకు చాలీచాలని పరిహారం ప్రకటించడంపై సోమవారం జిల్లా కేంద్రంలోని ఫవారా చౌక్ వద్ద తమ కార్యకర్తలు ధర్నా, నిరాహార దీక్ష చేపడతారని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా బాధితుల కుటుంబాల బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు చింద్వారా అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లాడి మృతదేహాం వెలికితీత..
సిరప్ తాగి చివరగా మృతి చెందిన రెండేళ్ల యోగితా ఠాక్రే మృతదేహాన్ని ఆదివారం పోస్ట్ మార్టం కోసం వెలికితీసినట్లు ధీరేంద్ర సింగ్ తెలిపారు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేయాలని కుటుంబ సభ్యులు కోరినట్లు సింగ్ తెలిపారు.
ఇది ఇలా ఉండగ మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని ఇద్దరు పిల్లలు కూడా కోల్డ్రీఫ్ సిరప్ తీసుకున్నాకే మరణించారని ఆరోగ్య అధికారులు ఆదివారం వెల్లడించారు.
ఈ సిరప్ తీసుకున్న ఎనిమిది మంది పిల్లల ఆరోగ్య విషమించడంతో నాగ్ పూర్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురు ప్రభుత్వ ఆస్పత్రిలో మరోకరు ఎయిమ్స్ లో, ముగ్గురు ప్రయివేట్ ఆస్పత్రిలో ఉన్నారు.
మరణించిన పిల్లలలో 11 మంది పరాసియా సబ్ డివిజన్ కు చెందిన వారు కాగా ఇద్దరు చింద్వారా నగరానికి, ఒకరు పక్కనే ఉన్న చౌరాసియా తహసీల్ కు చెందినవారు.
వేల పరీక్షలు..
పరాసియా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర సింగ్ జాట్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు, ఈ బృందం తమిళనాడులోని ఫార్మా కంపెనీని సందర్శిస్తుందని అదనపు కలెక్టర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకూ 1,102 మంది పిల్లల నుంచి నమూనాలను సేకరించామని, 5,657 పరీక్షలు నిర్వహించామన, వాటిలో 4,868 మంది ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు.
కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇందులో సిరప్ లో పారిశ్రామిక రసాయనాలు ఉన్నట్లు పరీక్షలలో తేలింది. ఈ కంపెనీ తయారు చేసిన సిరప్ ను రాజస్థాన్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడులో నిషేధం విధించారు.
సిరప్ సూచించిన డాక్టర్ సోనీ, కంపెనీపై భారతీయ న్యాయసంహిత సెక్షన్లు 105(హత్య తో సమానం), 276(మాదక ద్రవ్యాల కల్తీ) కింద అభియోగాలు మోపారు. వారిపై డ్రగ్స్ కాస్మైటిక్స్ చట్టంలోని సెక్షన్ 27ఏ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇది పది సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చని పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ పాండే తెలిపారు.
Next Story