
ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆతిశీ
ఆప్- బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం
ఆప్ మాజీ ఎమ్మెల్యే పాఠక్ ఇంటిపై సీబీఐ దాడులు, విదేశీ నిధుల నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు
ఆప్ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు చేయడంపై ఆప్- బీజేపీ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. పార్టీకి సంబంధించి విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆప్ మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ ఇంటిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై ఏజెన్సీ కేసు నమోదు చేసింది.
పార్టీని భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది
ఈ సోదాలపై ఆప్ స్పందించింది. పార్టీని నాశనం చేద్దామని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత ఉపాయాలను అమలు చేస్తోందని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు.
‘‘బీజేపీ నీచపు ఆటలు మళ్లీ మొదలయ్యాయి. సీబీఐ గుజరాత్ కో ఇంచార్జ్ ఇంటికి చేరుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడానికి మోదీ ప్రభుత్వం అనేక దారులు వెతికింది.
కానీ ఇప్పటికీ ఆ పార్టీ శాంతించలేదు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. పాఠక్ ని గుజరాత్ కో ఇంచార్జ్ గా నియమించిన వెంటనే ఆయనను బెదిరించడానికి సీబీఐని పంపారు’’ అని రాజ్యసభ ఎంపీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సీబీఐ సోదాలు కేవలం రాజకీయ ప్రేరేపితం అని ఆప్ విమర్శలు గుప్పించింది. 2027 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలకు పక్కదారి పట్టించడమే దీని లక్ష్యం అని ఆరోపించింది. పాఠక్ గుజరాత్ కు పార్టీ సహ ఇంచార్జీగా ఉన్నారు.
2027 లో గుజరాత్ లో ఎన్నికలు..
‘‘ఆప్ ను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు మరోసారి ప్రారంభం అయ్యాయి. వారు మా నాయకుడిని జైలులో పెట్టారు. మా అగ్ర నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మా పీఏసీ సభ్యుడు, గుజరాత్ కో ఇన్ ఛార్జ్ దుర్గేష్ పాఠక్ పై సీబీఐ దాడులు చేసింది. గుజరాత్ లో ఆప్ ప్రాబల్యం పెరుగుతుండటమే దీనికి ఏకైక కారణం’’ ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో అన్నారు.
పార్టీ స్థానాన్ని బలోపేతం చేయడానికి పాఠక్ గుజరాత్ లో వరుసగా సమావేశాలు నిర్వహించడం ప్రారంభించిన వెంటనే బీజేపీ తన కేంద్ర ఏజెన్సీని అతనిపై దాడి చేయడం ద్వారా స్పందించిందని సింగ్ పేర్కొన్నారు.
2027 గుజరాత్ ఎన్నికలకు దుర్గేష్ పాఠక్ బాధ్యత తీసుకున్న వెంటనే ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేయడం యాధృచ్చికం కాదు. ఇది భయం నుంచి పుట్టిన కుట్రగా సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ దాడిని ఖండిస్తూ ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆతిషీ మాట్లాడారు. గుజరాత్ ఎన్నికలకు ఆప్ సన్నాహాలు ప్రారంభించిన తరువాత రాష్ట్ర కో ఇంచార్జ్ అయిన దుర్గేష్ పాఠక్ ఇంటిపై సీబీఐ దాడులు చేసిందని అన్నారు.
ఇది బీజేపీలో నిరాశను చూపిస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2022 లో రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న పాఠక్, 2025 ఎన్నికల్లో బీజేపీపి చెందిన ఉమాంగ్ బజాబ్ చేతిలో ఓడిపోయాడు.
2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన గోవా ఆప్ పార్టీ ఇంచార్జీగా ఉన్నాడు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఐదు సీట్లను 14 శాతం ఓట్లను గెలుచుకుంది.
ఆప్ ఒక అవినీతి పార్టీ: బీజేపీ
ఈ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అంటేనే అవినీతి అని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా దోపిడీ చేసిన డబ్బును దుర్గేష్ పాఠక్ రాష్ట్ర ఇన్ చార్జీగా ఉన్నప్పుడు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారని ఆరోపించింది.
‘‘ఆప్ ఒక అవినీతి పార్టీ. పాఠక్ గోవా ఇంచార్జీగా ఉన్నప్పుడు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న డబ్బును అసెంబ్లీ ఎన్నికల లో ఉపయోగించారు’’ అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆరోపించారు.
గుజరాత్ లో ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉందని, తమ పై అంటిన అవినీతి మరకలను పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని అన్నారు.
Next Story