‘వంద యూనిట్లు’ దాటని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ కరెంట్ మీటర్
x

‘వంద యూనిట్లు’ దాటని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ కరెంట్ మీటర్

ఏసీలు, ఫ్రిజ్ లు, కూలర్లు ఉన్నా తిరగని కరెంట్ మీటర్, కేసు నమోదు చేసిన యూపీ విద్యుత్ శాఖ


సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, సంభాల్ లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన అల్లర్లకు కారకుడిగా ఉన్న జియావుర్ రెహ్మన్ బార్క్ ఇంటి పై విద్యుత్ శాఖ అధికారులు పోలీసుల సాయంతో తనిఖీలు నిర్వహించారు. సంభాల్ లోని దీపాసరాయ్ ప్రాంతంలో ఉన్న సదరు ఎంపీగారి ఇళ్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారికంగా తీసుకున్నవాటి కంటే పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగిస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఎంపీ పై విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 135, (విద్యుత్ చౌర్యం లేదా అనధికారికంగా విద్యుత్ వినియోగం) కింద కేసు నమోదు చేశారు.

సెక్షన్ 135 కింద అభియోగాలు..
సంభాల్ సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) సంతోష్ త్రిపాఠి ప్రకారం.. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్, 1948లోని సెక్షన్ 135 ప్రకారం పార్లమెంట్ సభ్యుడిపై అభియోగాలు మోపినట్లు ప్రకటించారు. ఆయనకున్న మూడు ఇళ్లలో ఇదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.
ఎంపీ ఇంటిని పరిశీలించిన సమయంలో, ఒక్కొక్కటి 2 కిలోవాట్‌ల సామర్థ్యంతో కేవలం రెండు విద్యుత్ మీటర్లు మాత్రమే ఉన్నట్లు కనుగొన్నారు. సాధారణంగా ఆ ఇంటికి పది కిలోవాట్ల మేర విద్యుత్ వినియోగం ఉండాలి. కానీ నిబంధనలు బేఖాతరు చేసి విద్యుత్ ను అక్రమంగా వాడుకుంటున్నారని అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి తనిఖీలు..
'గురువారం ఉదయం 7 గంటలకు స్థానిక విద్యుత్ శాఖ బృందం, భారీ పోలీసు బందోబస్తుతో ఎంపీ నివాసంలో గంటపాటు తనిఖీలు నిర్వహించింది. విద్యుత్ సరఫరాలో పలు అవకతవకలను బృందం గుర్తించింది.
“ఎంపీ పేరు మీద నమోదైన విద్యుత్ మీటర్ జూలై నుంచి ప్రారంభమై గత ఆరు నెలలుగా జీరో రీడింగ్‌ను చూపుతోంది. మునుపటి నెలల్లో కూడా, రీడింగ్‌లు 100 యూనిట్లకు మించలేదు. ఇంట్లో ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర ఉపకరణాలు ఉన్నందున, జీరో రీడింగ్ అసంభవం” అని త్రిపాఠి అన్నారు.
సంభాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) వందనా మిశ్రా చొరవతో అక్రమ విద్యుత్ కనెక్షన్ లపై ఇక్కడ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీ చేయడానికి ముందు విద్యుత్ శాఖ పోలీసుల సాయాన్ని కోరిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శ్రీష్ చంద్ర ధృవీకరించారు.
ఈ ఆరోపణలపై ఎంపీ తరఫు న్యాయవాది ఖాసీం జమాల్ వివరణ ఇచ్చారు. ఇంటికి రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయని, ఒక్కోటి 4 కిలోవాట్ల సామర్థ్యంతో ఉన్నాయని చెప్పారు. ఇంట్లో 5 కిలో వాట్ జనరేటర్, 10 కిలో వాట్ సోలార్ ప్యానెల్ ఉన్నాయని, వీటిని కోర్టుకు అందజేస్తామని పేర్కొన్నారు.
విద్యుత్ చౌర్యం..
ఎలక్ట్రికల్ టెస్టింగ్ లేబొరేటరీ నుంచి అందిన వినియోగదారుడి మీటర్‌ను పరిశీలిస్తే మీటర్ లేకుండా విద్యుత్ ను వాడుకుంటున్నారని, ఇది కచ్చితంగా చౌర్యమే అని ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు. సంభాల్ లో అల్లర్లు జరగడానికి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కారణమని వీరి వల్ల నలుగురు యువకులు మరణించారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తన అరెస్టుపై స్టే విధించాలని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.



Read More
Next Story