‘ఖర్గే, అఖిలేష్’ లు కుంభమేళాలో అతిపెద్ద విషాదాన్ని కోరుకున్నారు: యోగీ
సనాతన వ్యతిరేకులమని చెప్పుకోవడానికి పోటీపడుతున్నారన్న యూపీ సీఎం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగైన మహాకుంభమేళాలో అతిపెద్ద విషాదం జరగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు కోరుకున్నారని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ‘‘సనాతన వ్యతిరేక శక్తులు’’ కుంభమేళా తొక్కిసలాటను తమ రాజకీయ లాభం కోసం వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తొక్కిసలాట..
మౌనీ అమావాస్య సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరించడానికి దాదాపు 10 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు వచ్చారు. ఈ సందర్భంగా అర్థరాత్రి తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. ఈ వివరాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
అయితే ఈ గణాంకాలు తప్పని లోక్ సభలో ఖర్గే, అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. వేలాది మంది ఇందులో మరణించారని, ప్రభుత్వం కావాలనే లెక్కలు చెప్పకుండా దాస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం స్పందించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాను దేశంతో పాటు, ప్రపంచం కూడా ఆసక్తిగా చూస్తోంది. అయితే దేశంలోనే తిష్ట వేసిన కొన్ని దుష్టశక్తులు దీనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి.
అబద్దాలు ఎత్తిచూపుతూ, విషాన్ని ప్రచారం చేస్తున్నాయి. మోసాలకు కూడా కొత్త ప్రమాణాలు కూడా నిర్దేశిస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ రోజు పార్లమెంట్ లో చేసిన ప్రకటనలు వారి దుష్ట ఎజెండా ను బయటకు తీశాయని అన్నారు.
పరువు నష్టం ఆరోపణలు..
మహాకుంభమేళాను మొదటి నుంచి అప్రతిష్ట పాలు చేయడానికి ఇద్దరు నాయకులు ప్రయత్నిస్తున్నారని యూపీ సీఎం ఆరోపించారు. వారి ప్రకటనలు వారి మనస్సులోని సనాతన వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేయడమే కాకుండా వారి రాబందులాంటి దృక్పధాన్ని కూడా తేటతెల్లం చేశాయన్నారు. మొదటి రోజు నుంచే వారు తమ కథనాలను ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
ఖర్గే పై నేరుగా విమర్శలు..
‘‘ప్రయాగ్ రాజ్ లో మౌనీ అమావాస్య రోజుల జరిగిన తొక్కిసలాటలో వేలాది మంది మరణించారు’’ అని పార్లమెంట్ లో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై యోగీ విరుచుకుపడ్డాడు. దేశంలోనే అత్యంత పురాతన పార్టీకి నాయకత్వం వహించే నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవా అంటూ చురకలు అంటించారు.
సీనియర్ నాయకులు బాధ్యతాయుతమైన ప్రకటన చేయాలి. కానీ ఆయన ప్రజలను తప్పుదారి ప్రకటించే మాటలు మాట్లాడుతున్నారని, ఇద్దరు నాయకులు ఎవరు అత్యంత సనాతన వ్యతిరేకులనే ముద్ర తెచ్చుకోవడానికి పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పించారు. కుంభమేళా తొక్కిసలాటపై అధికారిక డేటా అందించలేదని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను కూడా ఆయన తోసిపుచ్చారు.
శీఘ్రంగా స్పందించాం
కుంభమేళా తొక్కిసలాట సందర్భంగా అక్కడి పరిపాలన యంత్రాంగం, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పౌర రక్షక దళాలు వేగంగా స్పందించాయని, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాయని యూపీ సీఎం చెప్పారు.
మా ప్రాధాన్యత ఒకటే.. కుంభమేళా సజావుగా జరగాలి. ఒక్క ప్రాణ నష్టం కూడా సంభవించకూడదు. కానీ దురదృష్టవశాత్తూ ఓ సంఘటన జరిగిందన్నారు. కానీ రెండు పార్టీలు మాత్రం ఎంత పెద్ద విపత్తు జరిగితే తమకు అంత లాభం అని ఎదురు చూస్తున్నాయని సీఎం ఆక్షేపించారు.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాం. చనిపోయిన బాధిత కుటుంబాలకుసంతాపం తెలిపి, నష్ట పరిహారం అందించాము. వారి ప్రాణాన్ని కాపాడలేకపోయామని అన్నారు. కొంతమంది గాయపడిన భక్తులకు ప్రయాగ్ రాజ్ లోని మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
Next Story