ఈడీ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య
x

ఈడీ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య

మృతుడు కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారుడని బీజేపీ ఆరోపణ


మధ్య ప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలోని ఓ వ్యాపార వేత్త, ఆయన భార్య ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడీ, బీజేపీ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

వ్యాపార వేత్త మనోజ్ పర్మార్, అతని భార్య నేహా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. భారత్ జోడో యాత్ర సందర్భంగా వారి పిల్లలు దాచుకున్న పిగ్గి బ్యాంక్ ను రాహుల్ గాంధీకి అందించారు. అయితే పార్టీకి అనుకూలంగా వ్యవహరాలు నడపడంతో ఈడీ, బీజేపీ వేధించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

నా పిల్లలకు అండగా ఉండండి..
సోషల్ మీడియాలో వచ్చిన సూసైడ్ నోట్ ప్రకారం.. వ్యాపారవేత్త మనోజ్ పర్మార్ తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర నాయకులను కోరాడు. తన చావుకు కారణం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బీజేపీ నాయకులే అని లేఖ లో ఆరోపించారు. పోలీసులకు అందిన సూసైడ్ నోట్ అప్లికేషన్ రూపంలో ఉందని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డిఓపి) ఆకాష్ అమల్కర్ తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులు ఇంకా శోకసంద్రంలో ఉన్నారని, అందుకే పోలీసులు వారి వాంగ్మూలాలను నమోదు చేయలేదని ఆయన అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తు జరుగుతున్నందున సూసైడ్ నోట్ గురించి మరింత వెల్లడించలేనని అమల్కర్ అన్నారు.
పర్మార్ - అతని భార్య నేహా శుక్రవారం ఉదయం సెహోర్ జిల్లాలోని అష్టా పట్టణంలోని వారి ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. సూసైడ్ నోట్ భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులకు రాసి ఉంది. టైప్ చేసి ముద్రించినట్లుగా కనిపించే ఒక నోట్‌లో, పర్మార్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గాంధీని కోరారు.
సూసైడ్ నోట్‌లో గాంధీ, కాంగ్రెస్ నేతల ప్రస్తావన గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీని ప్రశ్నిస్తే, "కాంగ్రెస్ ప్రజల పార్టీ. మేము వాటిని చూసుకుంటాం. అందుకే నేను నిన్న అక్కడకు వెళ్లాను" అని జాతీయ మీడియాకి చెప్పారు. పర్మార్ దంపతుల మరణం ఆత్మహత్య కేసు కాదని, ప్రభుత్వ ప్రాయోజిత హత్య అని, నాయకులను బీజేపీలో చేరేలా వేధించేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని పట్వారీ ఆరోపించారు. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థల వేధింపుల తర్వాత పలువురు నేతలు బీజేపీలో చేరారని ఆయన పేర్కొన్నారు.
కమల్ నాథ్ స్పందన..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఘటనపై ఎక్స్ లో స్పందించారు. బిజెపి ప్రభుత్వం ED అధికారుల వేధింపుల కారణంగా పర్మార్ తన భార్యతో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
"మృతుడి ఏకైక నేరం ఏమిటంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో, అతని పిల్లలు అతనికి పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వడం ద్వారా యాత్రకు మద్దతు ఇచ్చారు" అని పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఈడీ ప్రకటన..
భోపాల్ లోని జోనల్ ఈడీ అధికారి ఒక ప్రకటనలో.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పర్మార్ అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంకును మోసం చేసిన కేసులో పాత్రధారులు, సూత్రధారులు చురుగ్గా వ్యవహరించిన వారందరిపై మా శోధన కొనసాగింది. దీనికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
ఈ దాడిలో కొంతమంది వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేశామని, రూ. 3.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ స్తంభింప జేశామని పేర్కొంది. సోదాల్లో కీలక వ్యక్తులకు చెందిన నాలుగు స్థిరాస్తుల వివరాలు కూడా లభ్యమయ్యాయని తెలిపింది.
ప్రకటన ప్రకారం, పర్మార్, PNB సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన FIR ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన కింద రూ. 6 కోట్లను పొందారని ఆరోపించింది.
ఇవన్నీ వివిధ ఖాతాలకు మళ్లించారని తరువాత ఆస్తులలో పెట్టుబడి కోసం నగదు రూపంలో తీసుకున్నారని తెలిపింది. దీనిపై ఈడీ విచారణ కొనసాగుతోందని ఓ ప్రకటనలో తెలిపింది.


Read More
Next Story