
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్
‘‘దేశంలో మూడు కొత్త కోతులు పప్పూ, అప్పు, టప్పూ’’ : యూపీ సీఎం
రాహుల్ గాంధీ, అఖిలేశ్, తేజస్వీ యాదవ్ లపై విమర్శలు గుప్పించిన ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆర్జేడీ, ఎస్పీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలు నేరస్థులను ఆలింగనం చేసుకున్నాయని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్ లను ‘‘పప్పు, టప్పు, అప్పూ’’ అని అభివర్ణించారు.
దర్భంగా, ముజఫర్ పూర్, సరన్, పాట్నాలలో జరిగిన ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీహార్ లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత చొరబాటుదారులను తరిమికొట్టి రాష్ట్ర సంపదను పేదలకు పంపిణీ చేస్తుందని అన్నారు.
‘‘మహాత్మా గాంధీ మూడు కోతులు చెడును చూడవు, వినలేవు, మాట్లాడలేవు. కానీ ఇప్పుడు మనకు ఇండి కూటమిలో మూడు కోతులు ఉన్నాయి. కొత్త కోతులు ఎన్డీఏ చేసిన మంచి పనిని చూడలేని పప్పు, దాని గురించి వినలేని టప్పు, మాట్లాడేటప్పుడు వీటిని అంగీకరించలేని అప్పు’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు చొరబాటుదారులను అనుమతిస్తున్నాయని తద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు తీసుకువస్తున్నారని ఆదిత్యనాథ్ ఆరోపించారు.
బీహార్ లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తిరిగి తరిమికొడుతుందని రాష్ట్ర సంపదను పేదలకు పంచుతుందని అన్నారు. కులాల పేరుతో ప్రజలను విభజించి అల్లర్లు చేయడానికి ప్రతిపక్షాలు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాయని యూపీ సీఎం ఆరోపించారు.
‘‘1992 నుంచి 2005 వరకూ బీహార్ లో జరిగిన కులపోరాటాలు, అల్లర్లు అనేక ఊచకోతలకు కారణమయ్యాయి’’ అని ఆయన అన్నారు.‘‘మనం విడిపోకూడదని, ఒకరిపై మరొకరు పోరాడకూడదని( నా బటేంగే, నా కటేంగే) నిర్ణయించుకుందాం’’ అని ఆయన అన్నారు.
ఇంతకుముందు బీహార్ లో అధికారంలో ఉన్న ఆర్జేడీ రేషన్ దుకాణాలను దోచుకుందని, నేడు బీహార్ తో సహ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం అందుతుందని చెప్పారు.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని చెప్పిన బీజేపీ, దాన్ని సాధ్యం చేసి చూపిందని, అలాగే బీహార్ సీతామర్హిలో జానకీదేవి ఆలయాన్ని నిర్మించి, కేంద్రం అందించే రూ. 6,155 కోట్లతో రామ్ జానకీ మార్గ్ ద్వారా అయోధ్యతో అనుసంధానం చేస్తామన్నారు. బీహార్ లో లక్కగాజులను ప్రొత్సహించడానికి కృషి చేస్తుందని చెప్పారు.
ఆర్జేడీ పాలనలో బీహార్ గుర్తింపును కోల్పోయిందని ఆరోపించారు. రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్, ఆర్జేడీ బీఆర్ అంబేద్కర్ కు గౌరవించలేదని, కానీ ప్రధాని మోదీ ఆయనతో అనుబంధం ఉన్న ఐదు భూములను అభివృద్ది చేసిందని చెప్పారు. జయప్రకాశ్ నారాయణ్ పేరు వాడుకునే ప్రతిపక్షాలు రాజకీయాలు చేసినప్పటికీ సీతాబ్ దియారాలో తన భార్య పేరు మీద ఆస్పత్రి నిర్మించాలనే కోరికను మాత్రం విస్మరించారని ఆయన ఆరోపించారు. బీహార్ నేత బాబూ జగ్జీవన్ రామ్ ను ప్రధానిగా చూడటానికి కాంగ్రెస్ అంగీకరించలేదని యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు.
ఆర్జేడీ పాలనలో 30 వేల కిడ్నాప్ లు జరిగాయి. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడలేదు. ఆర్జేడీ ఎల్లప్పుడూ నేరస్థులను ఆదరించిందని, కానీ ఎన్డీఏ పాలనలో బుల్డోజర్ వారిని నిర్మూలించిందని అన్నారు. దిఘాలోని 1024 ఎకరాల భూమి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ సెమీకండక్టర్ పరిశ్రమను కూడా స్థాపించి హజ్ గా మారుస్తామని హమీ ఇచ్చారు.
Next Story

