
రబ్రీదేవీ, తేజస్వీ యాదవ్ తో రోహిణి ఆచార్య
‘లాలూ’ కుటుంబంలో కొనసాగుతున్న కల్లోలం
తనను కొట్టడానికి చెప్పు ఎత్తారని తేజస్వీ సోదరి రోహిణి ఆచార్య పేస్ బుక్ పోస్ట్
బీహార్ అసెంబ్లీ ఫలితాలు లాలూ కుటుంబంలో చిచ్చురాజేసింది. ఇప్పటికే పార్టీ నుంచి, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, తాజా మరో బాంబు పేల్చారు.
తన సోదరుడు తేజస్వీ యాదవ్, అతని సహచరులు ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. తనకు ఇప్పుడు కుటుంబం లేదని, ఒంటరిగా మిగిలాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తేజస్వీ యాదవ్ సన్నిహితులు అయిన సంజయ్ యాదవ్, రమీజ్ దేల పూర్తి బాధ్యత అని, కానీ వారు దానిని స్వీకరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఈ విషయంపై తేజస్వీ యాదవ్ ఇంకా స్పందించలేదు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తేజస్వీ యాదవ్ తో రోహిణి ఆచార్యకు తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ఓటమికి రోహిణే కారణమని తేజస్వీ ఆరోపించినట్లు సమాచారం. ‘‘తుమ్హారా హాయ్ లగ్ గయా హమ్ లోగో కో( నీవల్లే మాకు శాపం తగిలింది)’’ అని తేజస్వీ అన్నారు. తన పై చెప్పు విసిరి దుర్భాషలాడారని కొన్ని వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి.
‘‘నాకు కుటుంబం లేదు. మీరు వెళ్లి తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ లను అడగండి. నన్ను కుటుంబం నుంచి వెళ్లగొట్టింది వాళ్లే. వారు ఎటువంటి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు’’ అని రోహిణి పాట్నా ఎయిర్ పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
‘‘పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైందని దేశం మొత్తం అడుగుతోంది. నేను సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లను చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అవమానించారు’’ అని రోహిణి వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
అనాథగా మిగిలాను..
‘‘తనను కొట్టడానికి చెప్పు ఎత్తారు. అయినప్పటికీ నా ఆత్మగౌరవం విషయంలో రాజీలేదు’’ అని రోహిణి తన పేస్ బుక్ పేజీలో విమర్శించారు.
‘‘నిన్న ఒక కూతురు, ఒక సోదరి, ఒక వివాహిత మహిళ అవమానించబడ్డారు. ఆమెపై అసభ్యకరమైన భాషను వాడారు. కొట్టడానికి చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడను. సత్యాను వదులుకోను. ఈ కారణంగానే నేను ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చింది’’ అని ఆమె తన పోస్ట్ లో పేర్కొంది.
తన ఏడుస్తున్న తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వచ్చిందని, దీనివల్ల అనాథగా మిగిలాని రోహిణి చెప్పింది. రోహిణి ఆచార్య వైద్యురాలు, ఆమె సింగపూర్ లో స్థిరపడింది. తండ్రికి కిడ్నిని దానం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తను మురికి కిడ్ని దానం చేసినట్లు, దాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.
లాలూ కుటుంబం నుంచి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బహిష్కరణతో కుటుంబంలో చిచ్చు చెలరేగింది. రోహిణి వరుస పోస్ట్ లతో అది ఇంకా పెరిగినట్లు కనిపిస్తోంది. నిన్ననే రాజకీయాలు వదిలివేస్తున్నట్లు ప్రకటన చేసిన రోహిణి, తాజాగా తనపై చెప్పు ఎత్తారని మరో పోస్ట్ చేసి లాలూ కుటుంబంలోని బేదాభిప్రాయాలను బయటపెట్టింది.
సెప్టెంబర్ లో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో రాజకీయా నాయకులు, బంధువులను ఆన్ ఫాలో చేసింది. తరువాత చేసిన ఓ పోస్ట్ లో దుష్ట ఆలోచనలు ఉన్నవారందరిని బహిరంగంగా సవాల్ చేస్తున్నా అని ట్వీట్ చేసింది.
Next Story

