
విద్యుత్ అధికారులకు కరెంట్ నిలిపివేసిన ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ లో కరెంట్ కోతలు అమలు చేస్తున్నారంటూ కరెంట్ స్తంభం ఎక్కి కనెక్షన్ కట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉత్తరఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు కరెంట్ స్తంభం ఎక్కి, విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
విద్యుత్ కోతలతో విసుగు చెందిన ఆయన ఈ ఘటనకు పూనుకున్నారు. హరిద్వార్ జిల్లాలోని ఝబ్రేడాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర మంగళవారం ఈ ఘటనకు పాల్పడ్డారు.
దీనితో విద్యుత్ శాఖ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసింది. విద్యుత్ కనెక్షన్ తీసేసిన వారిలో ఒకరు ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ అని సమాచారం.
వీరేంద్ర మొన్నతన మద్దతుదారులతో ఒక నిచ్చెన, కొన్ని పనిముట్లతో రూర్కీకి వచ్చాడు. అతను మొదట బోట్ క్లబ్ లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్ పుత్ అధికారిక నివాసం వెలుపల ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ కనెక్షన్ నిలిపివేశాడు.
దీని తరువాత ఎమ్మెల్యే తన కాన్వాయ్ తో చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండే అధికారిక నివాసాలకు చేరుకుని, వారి ఇళ్లకు కూడా విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యేనే స్వయంగా చేశారు.

