మహాకుంభమేళ: గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా పవిత్ర స్నానాలు
x

మహాకుంభమేళ: గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా పవిత్ర స్నానాలు

ఇప్పటి వరకూ రెండు కోట్ల మంది భక్తుల రాక


చలి, దట్టమైన పొగమంచు, రక్తం గడ్డకట్టించే నీటి ప్రవాహాం ఉన్నప్పటిక కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ లో జరగుతున్న మహాకుంభమేళా లో పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రాంతి కావడంతో ఈ రోజు ఆచరించే స్నానాలను అమృత స్నాన్ గా పిలుస్తారు.

ఈ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భంగా భక్తులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. ఇదే సమయం మహా కుంభమేళా రావడంతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలివచ్చారు. ‘‘ దేశంలో, ప్రపంచంలో మహాకుంభ్ పట్ల ఉన్న ఆకర్షణ, పవిత్రతకు ఇదే సాక్ష్యం, ఒక్కరోజే 1.75 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు’’ అని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.

దేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇందులో ప్రయాగ్ రాజ్ తో పాటు ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ లో జరుపుతారు. అయితే మహాకుంభమేళ మాత్రం 144 సంవత్సరాలకు ఒకసారి అది కూడా కేవలం ప్రయాగ్ రాజ్ లోనే జరుగుతుంది. ఇందులో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మకర సంక్రాంతి సందర్భంగా తొలి అమృత స్నానాన్ని శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాతీ అటల్ అఖారా వారు చేశారు.
కుంభమేళాలో 13 అఖాడాలు..
మొదటి అమృత్ స్నాన్ అనేక విధాలుగా పవిత్రమైంది. పుష్య మాస పూర్ణమి తరువాత త్రివేణి సంగమంలో నిర్వహించే రెండో వేడుక ఈ స్నానం. ఇందులో ఈ రోజు వివిధ వర్గాలకు చెందిన 13 మంది అఖాడాలు పాల్గొన్నాయి. చలికాలంలో హిమాయాలయాల నుంచి వస్తున్న నీరు గడ్డకట్టే విధంగా ఉన్నప్పటికీ భక్తులు గుంపులు గుంపులుగా స్నానఘట్టాల వైపు కదులుతున్నారు. ఎక్కడ చూసిన ‘ హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై గంగామయ్య’ వంటి నినాదాలే వినిపిస్తున్నాయి.
మకర సంక్రాంతి తో పాటు వసంత పంచమినాడు సనాతన ధర్మంలోని 13 ప్రధాన అఖారాలు అమృత స్నానంలో పాల్గొంటాయని కుంభమేళ నిర్వాహకులతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఉదయాన్నే ప్రారంభం..
మహా కుంభమేళాలో మొదటి స్నానం ఉదయం 5.30 ప్రారంభం అవుతుందని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహాంత్ రవీంద్ర పూరి జాతీయ మీడియాతో చెప్పారు. కుంభంతో ముడిపడి ఉన్న షాహి స్నాన్, పేష్వాయ్ వంటి పదాలను అమృత్ స్నాన్, చావ్నీ ప్రవేశ్ గా మార్చారు.
ఇలా పదాలను మార్చడానికి గల కారణాలను సైతం ఆయన వివరించారు. హరిద్వార్ లోని మానసా దేవీ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అయిన మహంత్ పూరి ప్రకారం.. మనమంతా హిందీ, ఉర్థూ లో పదాలు వాడుతున్నాం. కానీ మన దేవుళ్ల విషయంలో సంస్కృత భాషలో పేర్లుపెట్టాలని, సనాతన ధర్మం కొనసాగడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇదే విషయం పై ప్రయాగ్ రాజ్ లోని రామనామ బ్యాంక్ కన్వీనర్ అయిన అశుతోష్ వర్ష్నే ప్రకారం.. రామ్ లల్లా ప్రతిష్టాపన తరువాత జరగిన మొదటి అమృత స్నానం ఇదేనని అన్నారు.
మహాకుంభ మేళాలో వరుసగా రెండు పవిత్ర స్నానాలు రావడం కేవలం దైవ కృప మాత్రమే అని వర్ష్నే చెప్పారు. మొదటి రోజు పుష్య పూర్ణిమ, రెండో రోజు మకర సంక్రాంతి పర్వదినంతో పాటు అమృత స్నానం రావడం భగవంతుడి లీలా అన్నారు. అందుకే భక్తులు కోట్లాదిగా తరలివస్తూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని చెప్పారు.
కాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఓ అంచనా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండగగా ప్రసిద్ది కెక్కింది. ఇక్కడకు వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ ప్రకటించారు. జనవరి 13 న ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26 న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది.


Read More
Next Story