ఈ లోక్ సభ స్థానాలపై ఓ లుక్ వేయండి.. పోరు నువ్వా, నేనా.. అన్నట్లుంది
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్ ను స్వీప్ చేసి కాంగ్రెస్ కు పీడకల మిగిల్చింది. అయితే ఈ సారి ఎలాగైన మెజారిటీ స్థానాలు సాధించాలని వ్యూహాలు..
రాజస్థాన్ లో ఎండ వేడితో పాటు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎడారి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని అధికార బీజేపీ ఎదురు చూస్తుండగా, ఎలాగైన మెజారిటీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆ స్థాయి చేరుకోవడం కష్టమైన పనిలా అనిపిస్తోంది. అనేక మంది మాజీ కాంగ్రెస్ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ బలహీనపడింది. అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వంటి అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగేందుకు ఇష్టపడకపోవడం కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఏ మాత్రం బాగాలేదు.
2019లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్నికల అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో ఆర్‌ఎల్‌పీ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ, ఒంటరిగా వెళ్లి సత్తాచాటాలని అనుకుంటోంది.
చాలా నియోజకవర్గాల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య నేరుగా పోటీకి తలపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో కొన్ని ఆసక్తికరమైన ఎన్నికల పోరాటాలు ఉన్నాయి.
1. చురు: జాట్‌ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం, చురు బీజేపీ కొత్త ముఖం దేవేంద్ర ఝఝరియా, కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ కస్వాన్ మధ్య పోరు ఎంతో ఆసక్తిని రేపుతోంది. అధికార పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి రాహూల్ కస్వాన్ కాంగ్రెస్ లో చేరి టికెట్ సంపాదించుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ సీనియర్ నాయకుడు రాజేంద్ర రాథోడ్‌తో ఆయనకున్న వైరమే కస్వాన్ బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు.
ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి, చురు నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి కాంగ్రెస్ ఏమాత్రం సమయం వృథా చేయలేదు. ఉత్తర రాజస్థాన్‌లో ఉన్న చురు లోక్‌సభ స్థానంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఐదు ఎమ్మెల్యే సీట్లు, బీజేపీ రెండు, బీఎస్పీ ఒక స్థానం గెలుచుకుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఆ పార్టీ తన సొంత వారిని కాదని బీజేపీ వచ్చి రాహూల్ కు టికెట్ ఇచ్చింది.
2. కోటా-బుండి: కోటా-బుండి నియోజకవర్గంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పోటీగా కాంగ్రెస్ మరో మాజీ బీజేపీ నాయకుడిని రంగంలోకి దింపింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రహ్లద్ గుంజాల్ ను ఎంపిక చేసింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాకు దగ్గర వాడిగా పేరుగాంచిన గుంజాల్ కోట నుంచి రెండుసార్లు ఎంపీగా ఉన్న బిర్లాకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.
కోటాకు లోక్ సభ స్థానంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో నాలుగు సీట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. అందుకే ఇక్కడ కమలదళం, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. బిర్లా తన పార్లమెంటరీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నప్పటికీ, అతను కోటాలో తన ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకున్నాడు. గత రెండు ఎన్నికల్లోనూ 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి హడోటి ప్రాంతంలో గణనీయమైన పలుకుబడి ఉన్న ఈ సారి గెలుపు తేలికగా లభించకపోవచ్చు.
3. నాగౌర్: జాట్‌ల ప్రాబల్యం ఉన్న నాగౌర్ సీటులో పాత ప్రత్యర్థులైన కాంగ్రెస్ మాజీ ఎంపీ జ్యోతి మిర్ధా, బీజేపీ ఎంపీ ఆర్‌ఎల్‌పి హనుమాన్ బెనివాల్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ ఇద్దరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీపడ్డారు. అయితే విజయం మాత్రం బెనివాల్ నే వరించింది. అయితే, ఈసారి వారి రాజకీయ అనుబంధాలు మారిపోయాయి. గత ఏడాది బీజేపీలో చేరిన తర్వాత మిర్ధా అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా, 2019లో బీజేపీలో గెలిచిన బేనీవాల్ ఇప్పుడు కాంగ్రెస్‌తో తరఫున రంగంలోకి దిగారు.
జ్యోతి మిర్ధా కూడా 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగౌర్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఆమె మామ, కాంగ్రెస్ అభ్యర్థి హరేంద్ర మిర్ధా చేతిలో ఓడిపోయారు. బెనివాల్ ఒక ప్రభావవంతమైన జాట్ నాయకుడు, అతను ఈ ప్రాంత రైతులు, యువతలో ప్రజాదరణ పొందాడు. దేశ రాజధానిలో రైతు ఆందోళనల మధ్య వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 2020లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు.
జ్యోతి మిర్ధా ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. నాగౌర్ ను ఒకప్పుడు ఆమె వంశం పాలించింది. ఆమె తాత నాథూరామ్ మిర్ధా, కాంగ్రెస్ లో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి. 1971- 1996 మధ్య ఆరు పర్యాయాలు నాగౌర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1977లో జనతా పార్టీ వేవ్ సమయంలో, రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటును గెలుచుకుంది. అది కూడా నాగౌర్ నుంచే. ఇక్కడ నుంచి నాథూరామ్ 20,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
4. బార్మర్: పశ్చిమ రాజస్థాన్‌లో ఉన్న బార్మర్ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దూకడంతో ముక్కోణపు పోటీ ఉంది. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కైలాష్ చౌదరిపై కాంగ్రెస్ ఉమ్మెదరామ్‌ను రంగంలోకి దించగా, మొదటిసారి స్వతంత్ర ఎమ్మెల్యే యువనేత అయిన రవీంద్ర భాటి ఎన్నికల పోరుకు దిగాడు.
2023 అసెంబ్లీ ఎన్నికలలో బార్మర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అతని విజయం సాధించాడు. రవీంద్ర భాటి విద్యార్థుల హక్కుల గురించి గళం విప్పాడంతో మంచి పేరు సంపాదించుకున్నాడు..
5. బన్స్వారా: దక్షిణ రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా ఉండే నియోజకవర్గం, బన్స్వారాలో బీజేపీ- కాంగ్రెస్ మద్దతు ఉన్న భారత్ ఆదివాసీ పార్టీ మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించకపోవడంపై మనస్తాపానికి గురైన కాంగ్రెస్ మాజీ మంత్రి, ప్రముఖ గిరిజన నాయకుడు మహేంద్రజీత్ సింగ్ మాల్వియాను బిజెపి రంగంలోకి దించింది. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ దామోర్ కాంగ్రెస్ పోటీకి నిలిపింది.
ఇక్కడ కూడా ముక్కోణపు పోటీకి వేదికైంది. భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఇప్పటికే తన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్‌ను ఆ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, గత కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి, చివరి నిమిషంలో సీట్ల పంపకాల ఒప్పందాన్ని వారు ముగించారు. 2023లో ఏర్పాటైన భారత్ ఆదివాసీ పార్టీ ప్రతాప్‌గఢ్, బన్స్వారా-దుంగార్‌పూర్, ఉదయపూర్ జిల్లాల్లో ప్రభావం చూపుతుంది. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకుంది.
6. సికార్: సికార్‌లో రెండుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన స్వామి సుమేదానంద్‌పై కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీపీఐ (ఎం) మాజీ ఎమ్మెల్యే అమ్రా రామ్ పోటీ చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా అసెంబ్లీ నియోజకవర్గం లక్ష్మణ్‌గఢ్, సికార్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది, అయినప్పటికీ సీటు కూటమికి వెళ్లింది.
గత ఎన్నికలకు భిన్నంగా కాంగ్రెస్, వామపక్షాల మధ్య బీజేపీ వ్యతిరేక ఓట్ల విభజన ఉండదని, సీపీఐ(ఎం)-కాంగ్రెస్ కూటమి బీజేపీకి సవాల్ విసురుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన తర్వాత బీజేపీ అభ్యర్థి 'బ్రాండ్ మోదీ' , హిందూత్వ అంశాలపై ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
7. ఉదయపూర్: ఒకప్పటి కాంగ్రెస్ కోట, ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ 1952 నుంచి 2009 వరకు 9 సార్లు ఉదయ్‌పూర్ సీటును గెలుచుకుంది. అయితే, 2014, 2019లో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఉదయ్‌పూర్‌లో ఇద్దరు మాజీ ప్రభుత్వ అధికారుల మధ్య ఆసక్తికరమైన పోటీ జరగనుంది. ఉదయపూర్‌తో సహా నాలుగైదు జిల్లాల్లో రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్‌ఎస్‌ఆర్‌టిసి) అధికారిగా పనిచేసిన మన్నాలాల్ పోటీకి దిగుతున్నారు. ఈయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఐఎఎస్ అధికారి తారాచంద్ మీనాను పోటీకి దింపింది. మరోవైపు, గతంలో ఉదయ్‌పూర్ కలెక్టర్‌గా పనిచేసిన మీనా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా పేరు గాంచారు. కాంగ్రెస్‌లో చేరే ముందు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
8. జోధ్‌పూర్: 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండు విజయాల తర్వాత జోధ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆశిస్తున్నారు. 2014లో షెకావత్ 53 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు చెందిన చంద్రేష్ కుమారిపై 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి వైభవ్ గెహ్లాట్‌ను 2,74,440 ఓట్ల తేడాతో ఓడించడంతో ఆయన మరో అద్భుతమైన విజయంతో సీటును నిలబెట్టుకున్నారు.
జోధ్‌పూర్‌లో షెకావత్‌పై సచిన్ పైలట్ సహాయకుడు, రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కరణ్ సింగ్ ఉచియార్దాను కాంగ్రెస్ నిలబెట్టగా, జలోర్-సిరోహి లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా వైభవ్ గెహ్లాట్ పేరు పెట్టారు. షెకావత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దగా పోటీ చేయనప్పటికీ, జోధ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కొంత మంది బిజెపి నుంచే ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి స్వరాలు వెలువడుతున్నందున తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
రెండు దశల్లో ఎన్నికలు
రాజస్థాన్ లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో ఏప్రిల్ 19న గంగానగర్, బికనీర్, చురు, జుంజును, సికర్, జైపూర్ రూరల్, జైపూర్, అల్వార్, భరత్‌పూర్, కరౌలీ-ధోల్‌పూర్, దౌసా, నాగౌర్‌లలో 12 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 13 స్థానాలైన టోంక్-సవాయి మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బార్మర్, జలోర్, ఉదయ్‌పూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బరన్‌లకు ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరగనుంది.
Next Story