వృద్ధులపై రాహుల్ గాంధీ ప్రవర్తన ఇదేనా: బీజేపీ
ఆయన దురుసుగా తోసేయడంతో కిందపడిన ఎంపీ, రక్తస్రావం జరగడంతో కుట్లు వేసిన వైద్యులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ ను అవమానించారంటూ పార్లమెంట్ లో విపక్షాలు బుధవారం మొత్తం ఆందోళన చేయగా, గురువారం పరిస్థితి అదుపు తప్పి పరస్పర తోపులాటకు దారీ తీసింది. కాంగ్రెస్సే అంబేడ్కర్ ను తీవ్రంగా అవమానించిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఆందోళన దిగడంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఈపరిణామం చోటు చేసుకుంది.
అంతకుముందు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీసును అందజేయగా, బీజేపీ కూడా ఇదే ప్రివిలేజ్ నోటీసును కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సమర్పించింది.
తరువాత పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వారం దగ్గర ఎంపీలు నిష్క్రమించే ప్రాంతం గుండా లోపలికి ప్రవేశించాలని ఇండి కూటమి సభ్యులు పట్టుబట్టారు. దీనికి బీజేపీ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారిని రాహుల్ గాంధీ తోసేశారని, అందులో ఒడిశా ఎంపీ, మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడటంతో ఆయనకు గాయమై రక్తస్రావం జరిగింది. ఎడమ కంటికి దగ్గర దెబ్బతగలడంతో కొంచెంలో ప్రమాదం తప్పినట్లు అయింది. తరువాత ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు కుట్లు వేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ రౌడీలా ప్రవర్తించారని, ఓ వృద్ధుడిని తోసేశారని ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను రాహుల్ గాంధీ తోసేశారని మరో ఎంపీ ఫరుఖాబాద్ కు చెందిన బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్ పుత్ అని ఆయన వెల్లడించారు. అయితే నన్ను పార్లమెంట్ లోకి వెళ్లనీయకుండా బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో తోసివేశానని రాహుల్ గాంధీ జాతీయ మీడియాతో అన్నారు.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. ఉద్దేశపూర్వకంగా ఆయన మా ఎంపీలను కిందకు తోసేసి గాయపరిచారని పిటిషన్ లో పేర్కొంది.
పరామర్శించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజుజు
ఈ ఘటనపై ఒడిశా ఎంపీని పలువురు మంత్రులు పరామర్శించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు ప్రహ్లద్ జోషి వీరిలో ఉన్నారు. సారంగిపై జరిగిన దాడిని పరిశీలించిన తరువాత తగు చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు అన్నారు.
మరో వైపు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కలిసి బీజేపీ ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లోపలికి రానీయకుండా బీజేపీ ఎంపీలు వికృతంగా ప్రవర్తించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తనను బలంగా తోయడంతో కింద కూర్చున్నానని తెలిపారు. తనకు మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు.
Next Story