బయటి వ్యక్తులు రావొద్దు, మండే వస్తువులు ఉండొద్దు: సంభాల్లో ఉత్తర్వులు
x

బయటి వ్యక్తులు రావొద్దు, మండే వస్తువులు ఉండొద్దు: సంభాల్లో ఉత్తర్వులు

ఆలయం పడగొట్టి, మసీదు నిర్మించారనే ఆరోపణలపై సర్వే చేయడానికి వచ్చిన అధికారులపై అల్లరిమూకలు దాడి చేసిన ఘటనలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సంభాల్లో బయటి వ్యక్తుల..


ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కొత్త వ్యక్తులు ఎవరూ కూడా సంభాల్ కు రావద్దని, ఇళ్లపై రాళ్లు, పేలుడు పదార్థాలు, సీసాలు వంటివి నిల్వ చేయకూడదని ఆదేశించింది.

అలాగే సంభాల్ తహసీల్ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా యంత్రాంగం నవంబర్ 25 వరకూ 12 తరగతి వరకూ ఉన్న విద్యాసంస్థలను మూసివేసింది. ఆదివారం జరిగిన అల్లర్లలో ముగ్గురు నిరసనకారులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

వివాదం ఏమిటీ?
మొగల్ కాలంలో హరిహర దేవాలయం కూల్చివేసి, దాని స్థానంలో జామా మసీదు నిర్మించారని కోర్టులో హిందూ పక్షాలు కేసు దాఖలు చేశాయి. దీనిపై సర్వే చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు ఒకసారి మసీదులో సర్వే నిర్వహించారు. ఆదివారం ఉదయం రెండోసారి సర్వే నిర్వహించడానికి సమాయత్తం అవుతుండగా ఆ వర్గం ప్రజలు పోలీసులు ఇతర అధికారులపై కి రాళ్లదాడికి పాల్పడ్డారు.
పోలీసులు మైనర్ ఫోర్స్ ఉపయోగించడంతో పాటు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. రాళ్లదాడిని ఆపడానికి కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందారు.
మండే వస్తువులు ఉండరాదు
ఘర్షణల తరువాత, సంభాల్ పరిపాలన యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు పైకప్పులపై రాళ్లు, సోడా సీసాలు లేదా ఏదైనా మండే లేదా పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడం లేదా సేకరించడం పై నిషేధం విధించింది. నిషేధిత వస్తువులను నిల్వ ఉంచే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సంభాల్ సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదైనా భవన నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి ఉంటే, దానిని జప్తు చేయాలని ఎస్‌డిఎం తన ఆర్డర్‌లో స్థానిక పౌర సంస్థను ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం నవంబర్ 30 వరకు బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించింది. "ఉన్నతాధికారి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు, ఇతర సామాజిక సంస్థలు లేదా ప్రజా ప్రతినిధులు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించరాదు" అని ఉత్తర్వులు అమలులోకి తెచ్చారు.
పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర: కాంగ్రెస్
సంభాల్ అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అమాయకులను చంపడానికి యోగి ఆదిత్యనాథ్ పరిపాలన పూర్తి బాధ్యత వహిస్తుందని, అక్కడ శాంతి- సామరస్యానికి నిప్పు పెట్టడంలో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ సఫలం అయ్యాయని విమర్శించింది.
సంభాల్‌లో నిరసనకారులపై నేరుగా కాల్పులు జరిపిన వీడియోలు ఆదిత్యనాథ్, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల "చక్కటి ప్రణాళికతో కూడిన కుట్ర" అని ఆరోపించింది.
ఆదిత్యనాథ్ పరిపాలన మరోసారి మత సామరస్యాన్ని విస్మరించిందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు. "ఈ మొత్తం విషయంలో, సర్వే కొనసాగించాలని లేదా ఆపాలని బిజెపి కోరుకోలేదు. సామరస్యాన్ని నాశనం చేయడమే దాని ఏకైక లక్ష్యం" అని ఆయన ఆరోపించారు.
" బాటేంగే తో కటేంగే " అని ఖండించదగిన నినాదం ఇచ్చిన సిఎం ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్‌లోని ఏ పౌరుడు కూడా 'సురక్షితంగా' లేడు. ఈ రోజు సంభాల్‌లో జరిగిన అత్యంత దుర్భరమైన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని ఖేరా ఒక ప్రకటనలో ఆరోపించారు.
"సర్వే బృందంతో పాటు వచ్చిన అల్లరిమూకలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికల తర్వాత యోగి ప్రభుత్వం హింస, ద్వేషపూరిత రాజకీయాలను మరింత తీవ్రతరం చేసిందని ఇది స్పష్టం చేస్తోంది" అని ఆయన అన్నారు.
మొరాదాబాద్ డివిజనల్ కమీషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ వాహనాలను తగులబెట్టారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
అల్లరి మూక జరిపిన దాడిలో 20 మంది పోలీసులు గాయపడ్డట్లు తెలిపారు. ముస్లిం అల్లరి మూకలు మసీద్ సమీపంలోని ఇళ్ల పై నుంచి పోలీసులపైకి రాళ్ల దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Read More
Next Story