మహాకుంభ మేళ: తొలి రోజే స్నానమాచరించిన 40 లక్షల మంది భక్తులు
రెండు రోజుల్లోనే 85 లక్షల మంది భక్తుల రాక
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు ప్రారంభమైన మహాకుంభమేళాకు భక్తులు పొటెత్తారు. తొలిరోజే దాదాపుగా 40 లక్షల మంది భక్తులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యకాలంలో లక్షలాది మంది భక్తులు ‘భం భం బోలేనాథ్’ అంటూ గంగలో మునిగారు.
ప్రయాగ్ రాజ్ ను ఇతిహాసాలు త్రివేణి సంగమంగా అభివర్ణించాయి. ఇక్కడ గంగానదిలో యుమునానదీ సంగమిస్తుంది. అంతర్వాహిణిగా సరస్వతి నదీ ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కుంభ మేళ జనవరి 13 నుంచి ప్రారంభమై మహా శివరాత్రి వరకూ అంటే వచ్చేనెల ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది.
సాధారణంగా కుంభమేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ మహాకుంభమేళా మాత్రం 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి దీనికి అంత ప్రత్యేకత. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మంది హజరవుతారని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగగా ప్రసిద్ధికెక్కింది.
‘‘ ఇప్పటి వరకూ 40 లక్ష్లల కంటే ఎక్కువమంది ప్రజలు పవిత్ర గంగనదిలో మునకలు వేశారు’’ అని మహాకుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ జాతీయ మీడియాకు చెప్పారు.
పుష్య పూర్ణిమ
పుష్యమాసం 15 వ రోజును భక్తులు ఆధ్యాత్మిక స్నానాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారని, అలాగే కల్పవాసం ప్రారంభ అవుతుందని భక్తులు నమ్ముతారని ‘ రామనామ బ్యాంక్’ కన్వీనర్ అశుతోష్ వర్షేనీ తెలిపారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. సాధువులు, భక్తులు, నాగాలు ఇలా పవిత్ర గంగలో స్నానమాచరిస్తూ కనిపిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఈ సంఖ్య 50 లక్షల వరకూ చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక్క ఆదివారం రోజే 33 లక్షల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చారని, రాను రాను ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా రెండు రోజుల్లోనే ఇక్కడకు 85 లక్షలకు పైగా భక్తులు వచ్చారని తెలుస్తోంది. గంగానదీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం కనిపించడకుండా వాలంటీర్లు, ప్రభుత్వ పారిశుద్ధ్య విభాగాలు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
Next Story