జమ్మూకాశ్మీర్: ఇదేదో ‘అసెంబ్లీ రౌడీ’లా ఉందే..
తొంభైల్లో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు అలాగే జమ్మూకాశ్మీర్ ఓ ఎన్నిక..
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా లోక్ సభ స్థానం లో ఈసారి తీహార్ జైలులో ఉన్న అభ్యర్థి పోటీకి దిగాడు. తండ్రిని బయటకు రప్పించాలని భావించిన ఆయన ఇద్దరు కుమారులు సోమవారం జరిగిన ఐదో దశ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తండ్రిని గెలిపించి జైలుకు బయటకు తీసుకురావాలని భావించిన ఆయన ఇద్దరు కుమారులు ప్రచారం మొత్తం తమ భుజాలపై వేసుకుని ఇంటింటికి తిరిగారు. చూడటానికి ఏదో చిత్రం గుర్తుకు వచ్చింది కదూ? అది కూడా తెలుగు సినిమాను పోలీ లేదు.. అదే అసెంబ్లీ రౌడీలా సినిమాను గుర్తుకు తేవటం లేదు..
అవామీ ఇత్తెహాద్ పార్టీకి సారథ్యం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజనీర్ రషీద్, సోమవారం ఐదవ దశలో పోలింగ్ జరుగుతున్న బారాముల్లా నుంచి బరిలో ఉన్న 22 మంది అభ్యర్థులలో ఆయనొకరు.
రషీద్‌తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోన్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత, రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్‌లు ఇతర ప్రముఖులు ఇక్కడి నుంచి బరిలో దిగారు.
2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రషీద్‌ను టెర్రర్-ఫండింగ్ కార్యకలాపాల ఆరోపణలపై అరెస్టు చేశారు, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అరెస్టు చేయబడిన మొదటి ప్రధాన రాజకీయ నాయకుడు రషీదే. ఆయన అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆయనను ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి బయటకు తీసుకురావాలని రషీద్ కుమారులు అబ్రర్ రషీద్, అస్రార్ రషీద్ అనుకున్నారు. ప్రచారం మొత్తం వారు ఇద్దరే ప్రధానంగా ఉండి నిర్వహించారు. వారు నిర్వహించిన ర్యాలీలకు ప్రజలు విశేషంగా హాజరైయ్యారు. ఈ భారీ సమూహం తమకు ఓట్లుగా మారుతుందని, జైలు నుంచి తమ తండ్రి విడుదల కావడానికి కారణం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
గత 10-12 రోజులుగా ఎంతో ఉత్సాహం, సంకల్పం ప్రదర్శించిన ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను మొదటిసారి ఓటు వేశా, అది కూడా మా నాన్నకు ఓటు వేశా’’ అని అబ్రార్ విలేకరులతో అన్నారు. 40-50 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా మొదటి సారి ఓటు వేస్తారని, అందులో మెజారిటీ తమ తండ్రికి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘మా నాన్న ఐదేళ్లుగా జైల్లో ఉన్నారు.. ఆయన అరెస్టు ఎన్నికల ప్రచారాన్ని కష్టతరం చేసింది. తొలినాళ్లలో నేను ఒంటరిగా ఉన్నాననుకున్నా.. ప్రజలు ఎలాంటి అత్యాశ లేకుండా నాతో చేరిపోయారు, అప్పుడే ఉత్తర కాశ్మీర్ మాత్రమే కాదు.. మొత్తం కాశ్మీర్ నాకు అండగా నిలుస్తోంది’’ అని అబ్రార్ అన్నారు.
రషీద్ 2008, 2014లో లాంగేట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన అవామీ ఇత్తెహాద్ పార్టీకి నాయకత్వం వహిస్తుండగా, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కాశ్మీర్ మొత్తం మాతో నిలబడేందుకు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన అబ్రార్, "వారు తమ మనస్సాక్షి వాణిని విని, నాతో కలిసి న్యాయానికి, సత్యానికి మద్దతు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నారు. "మేము మా సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నించాము. ప్రజలు వారి మనస్సాక్షి ప్రకారం ఓటు వేసి అణచివేతకు గురైనవారికి అందరికి అండగా ఉంటారని అనుకుంటున్నాను. దేవుడు ఇష్టపడితే వారు( ప్రజలు సత్యం, న్యాయం వైపు నిలబడతారు"అన్నారాయన.
అబ్రార్ మాట్లాడుతూ, తన తండ్రి ఎప్పుడూ ప్రజల మాటలను వింటారని, అసెంబ్లీ లోపల వెలుపల వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించారని చెప్పారు. ఇంజనీర్ రషీద్ మాత్రమే తమ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించగలడని, ఆయనను జైలు నుంచి బయటకు తీసుకురావాలని ప్రజలకు తెలుసునని, అందుకే ప్రజలు సంప్రదాయ పార్టీలను తిరస్కరించి, తమకు ప్రాతినిధ్యం వహించే నాయకుడిని ఎన్నుకుంటారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన తండ్రి కేసును ప్రత్యేక NIA కోర్టు విచారిస్తోందని అబ్రార్ తెలిపారు.
ప్రజల సహకారంతో, వారి ఓట్లతో ఆయనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం వచ్చిందని, అందుకే ఈ ప్రచారాన్ని ప్రారంభించానని, లేకుంటే మాకు రాజకీయాలపై ఆసక్తి లేదని అన్నారు.
తన తండ్రి ఉత్తర కాశ్మీర్ సీటులో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. "ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసి ఉంటుంది ... ఎందుకంటే, మూడు-నాలుగు లక్షల మంది ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ప్రభుత్వం వారి తీర్పును అంగీకరించాలి, అలాగే గౌరవించాలి కూడా. ఒకవేళ ఇంజనీర్ రషీద్‌ను విడుదల చేయకపోతే ఓటర్లకు అన్యాయం జరుగుతుంది. అబ్రార్ కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ఇంతకుముందు అసమర్థులు మీకు ప్రాతినిధ్యం వహించారని అందుకే బహిష్కరణ రాజకీయాలు మీకు చేటు చేశాయని అన్నారు.
రషీద్ మరో కుమారుడు అస్రార్ తన మొదటి ఓటు తన తండ్రికి, న్యాయానికి వేసినట్లు చెప్పాడు. "ప్రజలు బయటకు వచ్చి న్యాయం కోసం ఓటు వేస్తారు. మేము మా ఉత్తమ ప్రయత్నం చేసాము. జైలులో ఉన్న మా తండ్రి కోసం స్వచ్ఛందంగా మాతో కనెక్ట్ అయిన ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం" అన్నారు
Next Story