
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
భారత్ ఏ దేశాన్ని శత్రువుగా చూడట్లేదు: రాజ్ నాథ్ సింగ్
ప్రయోజనాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయన్న రక్షణ మంత్రి
ప్రపంచంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా స్వావలంబన సాధించడం అనేది ఒక ఆప్షన్ కింద లేదని, ఇది ఒక అవసరంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ నిర్ణయంతో అమెరికాతో భారత దేశ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సుంకాలలో 25 శాతం పరస్పర సుంకాలు, 25 శాతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ప్రతీకార సుంకాలు విధించారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తుందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తూ ఈసుంకాలు విధించారు.
భారత రైతులు, చిన్న వ్యాపారులు ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని రక్షణ మంత్రి అన్నారు. ‘‘శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి. భారత్ ఎవరిని శత్రువుగా పరిగణించదు. మన రైతులు, వ్యవస్థాపకుల ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
స్వావలంబన అవసరం..
రక్షణ రంగంలో స్వావలంబన ప్రత్యేక హక్కుగా చూసేవారని కానీ ఇప్పుడు అది పురోగతి, మనుగడకు కీలకంగా మారిందని అన్నారు.
‘‘నేటీ ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ప్రతిరోజు మన ముందు అనేక కొత్త సవాళ్లు స్వాగతిస్తున్నాయి. అది మహమ్మారి, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు ఇలా ఏదో ఒక రూపంలో వస్తున్నాయి.
ఈ శతాబ్దంలో ఇప్పటి వరకూ అన్ని రంగాలలో అత్యంత అస్థిరంగా, సవాల్ గా ఉందని నిరూపించింది. నేటీ పరిస్థితులలో ఆత్మ నిర్బరత అనేది ఒక ప్రయోజనం కాదు. అది కచ్చితమైన అవసరంగా మారింది’’ అని రాజ్ నాథ్ ను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
ఇటువంటి భౌగోళిక రాజకీయ పరిణామాలలో రక్షణ పరికరాల కోసం బాహ్య వనరులపై ఆధారపడటం ఇకపై మంచిదికాదని స్పష్టమైందని, భారత దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండింటికీ స్వావలంబన చాలా అవసరమని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు.
ఆయుధాల ఎగుమతిదారులం..
మోదీ పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2014 లో భారత్ కేవలం రూ. 700 కోట్ల కంటే తక్కువగా ఉన్న రక్షణ ఉత్పత్తులు ఎగమతి చేసేదని, అవి ప్రస్తుతానికి 24 వేల కోట్లకు చేరుకున్నాయని రక్షణమంత్రి చెప్పారు. భారత్ కోనుగోలుదారు మాత్రమే కాదని, ఆయుధాల ఎగుమతిదారు కూడా అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. స్వదేశీ ఆయుధాలు ఇందులో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళిక, తయారీ లేకుండా ఏ మిషన్ కూడా విజయవంతం కాదని చూపించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
భారత యుద్ధనౌకలు, దేశంలోనే తయారు చేస్తున్నామని, ఆత్మనిర్భర భారత్ కింద అడుగులు పడుతున్నాయని చెప్పారు. నావికాళం ఈ మధ్య రెండు నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లను జలప్రవేశం చేయించింది. వాటిని నీటిలో నడిచే ఎఫ్-35 గా ఆయన అప్పట్లో అభివర్ణించారు. వీటిలో ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి ని దేశీయంగా 75 శాతం పరికరాలతో రూపొందించారు.
Next Story