కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిహాదీలకే రిజర్వేషన్లు అంటున్న మోదీ
x

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిహాదీలకే రిజర్వేషన్లు అంటున్న మోదీ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల రిజర్వేషన్లను లాగేసుకుని జిహాదీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల రిజర్వేషన్లను లాగేసుకుని జిహాదీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని ఈ ఆరోపణ చేశారు. ప్రధాని ఈ ఆరోపణ చేయడం ఇదే మొదటి సారి కాకపోయినా ముస్లిం జనాభా గణనీయమైన సంఖ్యలో ఉన్న బీహార్ లో ఈ మాట చెప్పడం గమనార్హం.

బీహార్ లోని తూర్పు చంపారన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో మంగళవారం (మే 21) మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజవాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవును తీవ్రంగా విమర్శించారు. వాళ్లందరూ సంపన్నులని, బంగారు చెంచాలతో పుట్టారని, వాళ్లకి బలహీనవర్గాల గోడు ఎన్నటికీ అర్థం కాదన్నారు.
ఇండియా కూటమి నేతలు- అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, "వక్రబుద్ధితో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారికి ప్రతినిధులున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడినపుడు వీళ్ల బండారం బయటపడుతుందన్నారు. 'తుక్డే-తుక్డే (ముక్కలు, ముక్కలు)' గ్యాంగ్ కి వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇండియా కూటమి అంటేనే పాపాల పుట్టని విరుచుకుపడ్డారు. వీళ్ల ఆటలు సాగనివ్వకూడదని మోదీ అభిప్రాయపడ్డారు.
"తొలి దశ ఎన్నికల్లోనే ఇండియా కూటమి కకావికలం కావడానికి ఇదే కారణం.. తర్వాతి దశల్లో అది బాగా దెబ్బతిన్నది. మిగిలిన రెండు దశల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగి జూన్‌ 4న ఈ కూటమి అసలు బండారం బయటపడుతుంది. ప్రతిపక్ష కూటమి ఆశయాలకు పెద్ద దెబ్బ తగులుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని జిహాద్‌ లకు అప్పగించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్న తన ఆరోపణలను ప్రధాని పునరుద్ఘాటించారు.
అంబేద్కర్ లేకుంటే నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేవాడు కాదు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష పార్టీల విమర్శలపై కూడా మోదీ విరుచుకుపడ్డారు. తన ప్రత్యర్థులు స్విస్ బ్యాంకుల్లో నోట్ల కట్టలు దాచుకున్నారని అన్నారు. "నేను పుట్టిందే పేదకుటుంబంలో.. సామాన్య ప్రజల కష్టాలు నాకు అరమైనంతగా వాళ్లకి తెలియదు అన్నారు. భారతదేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లేమో స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు అని మోదీ ఆరోపించారు.
ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించిన మోదీ ఏమన్నారంటే “లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు బెడ్‌రెస్ట్‌ సలహా ఇస్తానని ‘వారీస్ ఆఫ్ జంగిల్ రాజ్’ చెబుతున్నారు. నేను కన్నీళ్లు పెట్టుకుంటే చూడాలని కాంగ్రెస్‌కు చెందిన ‘షెహజాదా’ కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో వీళ్ల సహచరుడొకరున్నారు. ఆయన పేరు అఖిలేష్ యాదవ్. ఆయనైతే 'మోదీ తేరీ కబ్ర్ ఖుడేగీ' (మోదీని సమాధి చేస్తాం) అంటూ రంకెలేస్తున్నారు. నేనందుకే వారణాసి నుంచి పోటీ చేస్తున్నాను అంటున్నారు. పుట్టుకతోనే బంగారు పళ్లాల్లో తినే వారికి పోరాటాలతో కడుపు నింపుకునే వారి ఇక్కట్లు ఎప్పటికీ తెలియవు" అని మోడీ అన్నారు.
మోదీ తన ప్రసంగంలో గత ఏడాది లాలూ ప్రసాద్ నివాసంలో రాహుల్ ఆస్వాదించిన విందు గురించి కూడా ప్రస్తావించారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారికి అవినీతిపరులతో కలిసి భోజనం చేయడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని మోదీ వ్యాఖ్యానించారు.
మహాత్మా గాంధీకి తూర్పు చంపారన్‌ "కర్మ భూమయితే గుజరాత్ ఆయనకు జన్మభూమి" అన్నారు మోదీ.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గాంధీజీ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. ఒకే ఒక కుటుంబ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని ఆరోపించారు.
"నేను అధికారంలో వచ్చిన తర్వాత నా తొలి పదేళ్లు కాంగ్రెస్ వదిలేసిన అగాధాలను పూడ్చడానికి సరిపోయింది. రాబోయే కాలంలో దేశ ప్రగతిని వేగవంతం చేయాలని నేను భావిస్తున్నాను" అని మోదీ చెప్పారు. "మహిళలకు మరుగుదొడ్లు వంటి సంక్షేమ చర్యలపై తన దృష్టి ఉంటుందని, మౌలిక సదుపాయాలు లేకపోవటం వలన శారీరక రుగ్మతలు పెరుగుతాయని" మోదీ అన్నారు.
Read More
Next Story