
దలైలామా
నేను ఇంకో నలభై ఏళ్లు జీవించే ఉంటాను: దలైలామా
రేపు వైభవంగా టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడి 90 వ జయంతి, హాజరుకానున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు
కొత్త లామాను ప్రకటించడం, తన నిష్క్రమణ పై వస్తున్న పుకార్లను టిబెట్ మత గురువు, ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా తోసిపుచ్చారు. ప్రజలకు సేవ చేయడానికి మరో 30- 40 ఏళ్ల జీవించి ఉండాలని ఆశిస్తున్నట్లు తన మనసులోని మాటను వెల్లడించారు.
మెక్లియోడ్ గంజ్ లోని దలైలామా ప్రధాన ఆలయమైన సుగ్లాగ్ ఖాంగ్ లో ఆదివారం తన 90 వ జయంతికి ముందు జరిగిన దీర్ఘాయుష్షు ప్రార్థన సమయంలో ఆయన మాట్లాడారు. బుద్దుడి ఆశీస్సులు తనకు ఉన్నాయని, వాటిని సంబంధించిన స్పష్టమైన సంకేతాలు, సూచనలు తనకు అందుతున్నాయని చెప్పారు.
‘‘చాలా ప్రవచనాలు చూస్తుంటే నాకు అవలోకేశ్వరుడి(బుద్దుడు) ఆశీస్సులు ఉన్నాయని అనిపిస్తుంది. ఇప్పటి వరకూ నా వంతు కృషి చేశాను. ఇంకా 30-40 సంవత్సరాలు జీవించి ఉండాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలు ఇప్పటి వరకూ ఫలించాయి’’ అని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు అన్నారు. తాను చిన్ననాటి నుంచే బుద్దుడితో బలమైన అనుబంధం కలిగి ఉన్నానని ఆయన అన్నారు.
‘‘నేను ఇప్పటి వరకూ బుద్ధ ధర్మానికి, టిబెట్ జీవులకు చాలా బాగా సేవ చేయగలిగాను. నేను 130 సంవత్సరాల దాక జీవించాలని అనుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు.
14 వ దలైలామా జయంతిని జరుపుకోవడానికి టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడ వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు నిర్వహించింది. వేడుకల్లో భాగంగా ప్రధాన ఆలయంలో దీర్ఘాయుష్షు ప్రార్థన కార్యక్రమం జరిగింది. దీనికి 15 వేల మందికి పైగా హజరయ్యారు.
సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి టెన్జిన్ లెక్షయ్ ప్రకారం ఆలయం భక్తులతో నిండిపోయింది. టిబెటన్లు తమ దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్నప్పటీకి తాను చాలామంది ప్రజలకు మేలు చేయగలిగానని దలైలామా అన్నారు.
‘‘ఇక్కడ ధర్మశాలలో నివసిస్తున్న వారికి, నేను వీలైనంత వరకు ప్రయోజనం చేకూర్చాలని, సేవ చేయాలని అనుకుంటున్నాను.’’ అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ ‘‘ నాయకుడు మావో జెడాంగ్ ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మతం విషం అని బోధించడానికి ప్రయత్నించారు. కానీ నేను దానికి స్పందించలేదు. కాబట్టి ఆయన నన్ను హింసించే ప్రయత్నం చేశారు.
నేను దానికి స్పందించలేదు. కానీ నాకు మాత్రం కరుణ కలిగింది. తరువాత నేను నెహ్రూను కలిశాను. నా జీవితం, మతం పట్ల ఆసక్తి ఉన్నవారిని, మతం పట్ల ఆసక్తి లేని వారిని కలిశాను’’ అని టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు అన్నారు.
బౌద్ధ గ్రంథాల ప్రకారం మనుషుల మానసిక వైఖరి భిన్నంగా ఉంటుందని, వారు ఆనందం పొందడానికి ప్రయత్నిస్తారని ఆయన పేర్కొన్నారు.
‘‘మతం లేదా విశ్వాసం లేనివారు కూడా ఆనందాన్ని పొందుతారు. బాధలను నివారించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ భూమిపై ఉన్న అన్ని జీవులు, టిబెటన్లు కూడా బాధను కోరుకోరు. ఆనందాన్ని కోరుకుంటాము. ఆ కోణంలో మనమంతా ఒక్కటే. వారిని మనం ఆనందం కలిగించడానికి మన పద్దతుల్లో నిమగ్నమవ్వాలి’’ అని ఆయన అన్నారు.
కొత్త లామా ఎంపిక పై కొన్ని రోజులుగా విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. కానీ చైనా అభ్యంతరాల నేపథ్యంలో వాటిని తోసిపుచ్చారు. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు పెన్పా త్సెరింగ్ ఈ వార్తలను తోసిపుచ్చారు. దలైలామ మరో 20 సంవత్సరాలు జీవించబోతున్నారు. కాబట్టి మనం ఈ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది దీనిని ఆశించి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయన పవిత్రతతో ఎవరినైనా నియమించవచ్చు. ’’ అని త్సెరింగ్ అన్నారు.
దలైలామా జన్మదిన వేడుకలు ఆదివారం జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కిరణ్ రిజుజు, రాజీవ్ రంజన్ సింగ్ హజరవుతారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ హజరుకానున్నారు.
Next Story