
జమ్మూలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న విపత్తు భద్రతా దళాలు
జమ్మూ కాశ్మీర్ లో కుంభవృష్టి
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 30 మంది మృతి
జమ్మూకాశ్మీర్ లో నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వర్ష భీభత్సానికి ఇప్పటి వరకూ 30 మంది మరణించారు.
జమ్ము లో గత 24 గంటలలో చాలా ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ప్రవహిస్తున్న తావి, చీనాబ్, ఉజ్, రావి, బసంతర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదలు వల్ల కమ్యూనికేషన్ నెట్ వర్క్ చాలావరకు దెబ్బతీశాయి. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజుల వరకూ కొనసాగే అవకాశం ఉందని, మరో 24 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదు..
జమ్మూకశ్మీర్ లోని చాలా ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. వర్షాలతో చాలా ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘జమ్మూకశ్మీర్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా వరకూ ఆగిపోయింది. జియోలో డేటా వస్తోంది. కానీ వైఫై మాత్రం రావట్లేదు. ఏ ఆప్ లు పనిచేయడం లేదు. వాట్సాప్ నుంచి చిన్న చిన్న మెసెజ్ లు కూడా వెళ్లడం లేదు. ఎక్స్ చాలా కష్టంగా ఒపెన్ అవుతుంది’’ అని అబ్దుల్లా ట్వీట్ చేశారు. భారీ వర్షాలతో రైల్వే స్టేషన్, రోడ్స్ అన్ని మూసివేశారు.
నార్తర్న్ రైల్వే స్టేషన్ ఓ ప్రకటనలో 22 రైల్ సర్వీస్ లను రద్దు చేసినట్లు పేర్కొంది. చాలా రైళ్లు జమ్మూ, కత్రా రైల్వేస్టేషన్ లో ఆగిపోయాయి. ఉత్తర రైల్వే డివిజన్ కూడా 27 రైల్వేలు రద్దు చేసినట్లు పేర్కొంది. అనేక రైళ్లు రద్దు కావడంతో ప్రయాణీకులు స్టేషన్లలో చిక్కుకున్నారు. వీరికి అధికారులు ఆహారం, వసతి సౌకర్యాలు అందిస్తున్నారు.
‘‘స్టేషన్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ సాయంతో స్థానిక స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజంతో సమన్వయంతో ఆహార పదార్థాలు, నీటిని ఏర్పాటు చేశాం’’ అని జమ్మూ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం కాట్రా- శ్రీనగర్ మధ్య రైళ్లు నడుస్తున్నాయి. అయితే మొత్తం జాతీయ రహదారులను మూసివేశారు.
ప్రజలను ఖాళీ చేయించడం..
జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం స్థానిక స్వచ్చంద సేవకులు ప్రజలను ఖాళీ చేయించడం, కమ్యూనికేషన్ సదుపాయాలను పునరుద్దరించడం పై దృష్టి సారించారు.
జమ్మూ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కరోజు కంటే తక్కువ సమయంలో 250 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏకధాటి కుంభ వృష్టితో వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పంట పొలాలు మునిగిపోయాయి.
దుర్భర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, వారికి ఆశ్రయం కల్పించడం, ఆహారం, పరిశుభ్రమైన నీరు, వైద్య సంరక్షణ అందించడం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.
జిల్లా యంత్రాంగం అనేక ప్రదేశాలలో సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. జమ్మూలోని యూత్ హాస్టల్ ఒక ప్రధాన తాత్కాలిక ఆశ్రయంగా మార్చారు. అన్ని ప్రధాన సహాయ కేంద్రాలలో వైద్య బృందాలు సిద్దంగా ఉన్నాయి. విద్యుత్, నీటి సరఫరా, రోడ్డు కనెక్టివిటీ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి.
3,500 మందిని ఖాళీ చేయించిన..
జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నామని చెప్పారు. అధికారుల ప్రకారం అనేక ప్రాంతాలలో చిక్కుకున్న 3,500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు.

తాల్ నది పొంగిపొర్లుతుండటంతో కుంగిన జాతీయ రహదారి వంతెన
యాత్రికులు సహ 30 మంది మృతి
జమ్మూ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి బండరాళ్లు, చెట్లు, రాళ్లు కూలిపోయాయి. వర్షానికి సంబంధించిన వివిధ సంఘటనలలో వైష్ణోదేవీ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు సహ 30 మంది మరణించారు. దోడా జిల్లాలో కనీసం నలుగురు మరణించినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు నదిలో జారిపడి మరణించారు. ఒకరు ఇళ్లు కూలీ మరణించారు.
యాత్ర నిలిపివేత..
పంజాబ్ లో మొహాలికి చెందిన కిరణ్ ఈ వరదలో చిక్కుకున్నాడు. ‘‘నేను దర్శనం చేసుకున్న తరువాత కొండ దిగుతుండగా ప్రజలు కేకలు వేయడం ప్రారంభించారు. రాళ్లు పడటం చూశాను. నేను బయటకు పరుగెత్తాను కానీ గాయపడ్డాను’’ అని కత్రాలోని ఆసుపత్రి బెడ్ పై నుంచి కిరణ్ జాతీయ మీడియాకు చెప్పారు. గాయపడిన వారిలో చాలామందిని జమ్మూలోని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాత్రాలోని నారాయణ ఆసుపత్రికి తరలించారు.
సీఎం అధ్యక్షతన అత్యవసర సమావేశం..
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఆయన జిల్లా అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు, మందులు వంటి నిత్యావసరాలను సకాలంలో అందించాలని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో నీటిని తోడేందుకు అధికారులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నందున ఏదైనా పరికరాల కొరత ఏర్పడితే వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల సహాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాలకు నష్టం..
వంతెనలు, మొబైల్ టవర్లు విద్యుత్ స్తంభాలు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ప్రదేశాలలో ఆప్టికల్ ఫైబర్ కు విస్తృతంగా నష్టం వాటిల్లిన తరువాత జమ్మూకాశ్మీర్ లోని అన్ని సేవా ప్రాంతాలలో నెట్ వర్క్ అంతరాయాలు సంభవించినట్లు నివేదికలు వస్తున్నాయి.
అంతరాలను తొలగించేందుకు సాంకేతిక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నట్లు టెలికాం ఆపరేటర్లు తెలిపారు. జమ్మూ డివిజన్ లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలను ఆగష్టు 27 వరకూ మూసివేయాలని ఆదేశించారు. జమ్మూకశ్మీర్ పాఠశాల విద్యా బోర్డు బుధవారం జరగాల్సిన 10 , 11 తరగతుల అన్ని పరీక్షలను కూడా నిలిపివేసింది.
Next Story