కలెక్టరమ్మకీ తప్పని మొగుడి వేధింపులు
x
భారతీ దీక్షిత్, ఆశీష్

కలెక్టరమ్మకీ తప్పని మొగుడి వేధింపులు

బాగా చదువుకున్న వారే, ఐఎఎస్ లే.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఓ పాప కూడా ఉంది. అయినా ఆమెకి భర్త వేధింపులు తప్పలేదు..


చదువు, సంస్కారం లేనివాళ్లా అంటే అదేం కాదు.. ఇద్దరూ సమాన హోదా ఉన్నవాళ్లే. బాగా చదువుకున్న వారే, ఐఎఎస్ లే.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఓ పాప కూడా ఉంది. అయినా ఆమెకి భర్త వేధింపులు తప్పలేదు.

కలెక్టర్ అయినా మొగుడి వేధింపులు తప్పడం లేదే అని అందరూ విస్తుపోతున్న సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
భారతీ దీక్షిత్ ఫిర్యాదు ఇదీ..
ఐఏఎస్‌ అధికారి అయిన తన భర్త వేధింపులతో గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. రాజస్థాన్‌ ఐఏఎస్‌ అధికారిణి భారతీ దీక్షిత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త ఆశిష్‌ మోదీపై జైపుర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాజస్థాన్‌ ప్రభుత్వ ఆర్థికశాఖలో జాయింట్‌ సెక్రటరీగా భారతీ దీక్షిత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం, సాధికారత విభాగం డైరెక్టరు. వీరిద్దరూ 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు. 2014లో తమ వివాహమైనప్పటి నుంచీ ఆశిష్‌ మోదీ తరచూ మద్యం తాగి.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు తెలిపారు.
పాప పుట్టాక వేధింపులు మరింత పెరిగాయని, అత్తింటివారి నుంచి తన ప్రాణాలకు హాని కూడా ఉందని భారతి ఫిర్యాదులో వెల్లడించారు. పలువురు నేరస్థులతోనూ ఆశిష్‌కు సంబంధాలున్నాయన్నారు.
గత నెలలో ఓ స్నేహితుడితో కలిసి తనను ప్రభుత్వ వాహనంలో తరలించి, కొన్ని గంటలపాటు నిర్బంధంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. విడాకులకు అంగీకరించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని తుపాకీ గురిపెట్టి బెదిరించారని భారతి ఆరోపించారు. ఆశిష్‌ను వివరణ కోరగా ఫిర్యాదుపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.
ఓ ఐఏఎస్ అధికారి పై, ఆయన ఐఏఎస్ భార్య చేసిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసుల ప్రకారం, నవంబర్‌ 7న ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త తనతో అబద్ధం చెప్పి, భావోద్వేగ ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి తరువాత, తన క్యాడర్‌ను నాగాలాండ్‌ నుంచి రాజస్థాన్‌కు మార్చించుకున్నాడని కూడా ఆమె పేర్కొంది.
తన దాంపత్య జీవితంలో భర్త తరచూ దాడులు, వేధింపులు చేశాడని భారతీ దీక్షిత్ ఆరోపించింది. జైపూర్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్ ఠాణా పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళా అధికారికి పోలీసుల రక్షణ కల్పించారు. పోలీసులు తెలిపిన ప్రకారం- మహిళా ఐఏఎస్‌ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఆమె భర్తపై మోసం, బెదిరింపులు, దాడి, ఐటీ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
2014లో ఆమె భారత పరిపాలనా సేవ (IAS)లో ఎంపికై, రాజస్థాన్‌ క్యాడర్‌లో చేరారు. అదే సమయంలో ఆమె తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మానసిక ఒత్తిడిలో ఉండగా, నాగాలాండ్‌ క్యాడర్‌కు చెందిన మరో ఐఏఎస్ అధికారి ఆమెపై భావోద్వేగ ఒత్తిడి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెళ్లి తరువాత తెలిసిందేమిటంటే- భర్త ఆశీష్ తప్పుడు సమాచారం చెప్పి, రాజస్థాన్‌ క్యాడర్ పొందడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. తర్వాత ఆయన ప్రవర్తన హింసాత్మకంగా మారిందని, తనపై పలు సార్లు దాడి చేశాడని, గొంతు నులిమి చంపడానికి కూడా ప్రయత్నించాడని ఆరోపించారు.

కూతురు పుట్టిన తర్వాత పరిస్థితి మరింత విషమించిందని చెప్పారు. భయంతో కొంతకాలం ఢిల్లీలోని పుట్టింట ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
ఇతర మహిళలతో సంబంధాలు కూడా!
ఆశిష్‌ మోదీకి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తాను ఎవరికైనా విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించే వాడని భారతీ దీక్షిత్ ఆరోపించారు. అజ్మీర్‌, బికనీర్ లో పని చేసినపుడు కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లు ఆమె తెలిపింది.
Read More
Next Story