ఐఏఎఫ్ పాకిస్తాన్ రాడార్లను ఎలా బోల్తా కొట్టించిందో తెలుసా?
x
ఆపరేషన్ సిందూర్ లోగో

ఐఏఎఫ్ పాకిస్తాన్ రాడార్లను ఎలా బోల్తా కొట్టించిందో తెలుసా?

దాయాదీ దేశం వైమానిక రక్షణ వ్యవస్థపై బ్రహ్మోస్ ప్రయోగించిన భారత వైమానిక దళం


ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో రోజులు గడచిన కొద్ది ఆసక్తికరమైన అనేక విషయాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. తాజాగా భారత వైమానిక దళం, పాకిస్తాన్ రాడార్లను బురిడి కొట్టించి, వాటిని కూల్చివేసిన విషయం బయటపడింది.

పహల్గాం దాడి తరువాత ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై భారత్ దాడి చేసి అంతం చేయాలని నిశ్చయించుకుంది. అయితే తమపై దాడి జరగబోతుందని ముందే ఊహించిన తీవ్రవాద దేశం పాకిస్తాన్ వారి సైన్యాన్ని అలర్ట్ చేయడంతో పాటు వైమానిక రాడార్లను సరిహద్దుల్లో మోహరించింది.
అయితే భారత్ కూడా అంతే స్థాయిలో సర్వసన్నద్దమైంది. తాము ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయగానే పాకిస్తాన్ సైతం ప్రతిదాడులు చేస్తుందని ముందే ఊహించిన ఐఏఎఫ్, అందుకోసం మార్గాలను వెతికిపెట్టి ఉంచింది. మే 7 న ఉదయం పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ల వర్షం కురిపించి వందమంది ఉగ్రవాదులను పైకి పంపింది.
సైన్యం ఊహించినట్లుగానే పాకిస్తాన్ ఆ రోజు రాత్రి డ్రోన్లు, మిస్సైల్, ఫైటర్ జెట్లతో దాడికి దిగింది. వీటిని భారత రక్షణ వ్యవస్థలు దిగ్విజయంగా అడ్డుకున్నాయి. అయితే భారత సైనిక బేస్ లు, పౌర ఆవాసాలే లక్ష్యాంగా దాడులు చేస్తున్నా పాక్ కు బుద్ది చెప్పాలని మన వ్యూహా కర్తలు భావించారు. అందుకు అడ్డంగా ఉన్న పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను బురిడి కొట్టించడానికి అప్పటికే ఆలోచించిన ప్రణాళికను అమలు చేశారు.
కొన్ని డ్రోన్లకు ఫైటర్ జెట్ ల రూపకల్పన చేసి పాక్ గగనతలంలోకి వదిలి ఆ దేశ వ్యవస్థలను మభ్యపెట్టినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
పక్కా ప్రణాళికతతో మోసం..
మే 9-10 రాత్రి సమయంలో భారత్ పాకిస్తాన్ లోని 12 కీలక వైమానిక స్థావరాలలోని 11 స్థావరాలపై దాడి చేసింది. అయితే క్షిపణి దాడి ప్రారంభించడానికి ముందే ఐఏఎఫ్ నిజమైన యుద్ద విమానాలుగా భ్రమ కల్పించే మానవరహిత యూఏవీలను ప్రయోగించింది.
పాక్తిస్తాన్ తమపైకి ఇండియా దాడి చేయడానికి యుద్ద విమానాలను పంపిందని తన రక్షణ వ్యవస్థలను ఆక్టివేట్ చేసి దాడులు చేయడానికి ప్రయత్నించింది. ఈ చర్యతో భారత్ కు పాకిస్తాన్ వైమానిక రాడార్లు ఎక్కడ ఉన్నాయో వెల్లడి అయింది. వీటిని పేల్చివేయడానికి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న హరోప్ ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించుకున్నాయి.
పాకిస్తాన్ వైమానిక దళం తన హెచ్ క్యూ -9 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ లాంచర్లు, రాడార్లు మొత్తం సెట్ ను వివిధ ప్రదేశాలకు సమీకరించింది. వాటిలో కొన్ని ఎత్తైన ప్రదేశాలలో మోహరించినప్పటికీ తరువాత వాటిని గుర్తించారు.
క్షిపణి దాడులు..
లక్ష్యాలను గుర్తించిన తరువాత భారత్ వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై లాంగ్ రేంజ్ క్షిపణి దాడులను కొనసాగించింది. ఇందులో సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ తో పాటు స్కాల్ప్ క్షిపణులు ఉన్నాయి. ఆ దాడిలో దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులు, స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ క్షిపణులు ఉన్నట్లు సమాచారం.
ఈ దాడులు పాకిస్తాన్ వైమానిక దళ నెట్వర్క్ లోని ఎయిర్ స్ట్రిప్ లు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను పేల్చివేశాయని, సింధ్ లోని వాయుమార్గాన ముందస్తు హెచ్చరిక విమానం(అవాక్స్) లేక అనేక దీర్ఘకాలిక డ్రోన్లను దెబ్బతీసినట్లు తెలుస్తోంది.
రక్షణ వర్గాల సమాచారం ప్రకారం తొలిసారిగా బ్రహ్మోస్ ను యుద్ద క్షేత్రంలో ఉపయోగించారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడులు చాలా తీవ్రంగా జరిగాయని, పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఎదురుదాడి మాని లొంగిపోవడానికి దారివెతుక్కుందని, ముందుకు తీసుకుపోవాలనుకున్న అన్ని సైనిక చర్యలను నిలిపివేసి వెంటనే డీజీఎంఓ తో చర్చలకు వచ్చిందని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
ధ్వంసమైన డ్రోన్లు..
పాక్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించినప్పుడూ ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా 600 కి పైగా పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డగించి నాశనం చేశాయి.
డ్రోన్ల చొరబాట్లకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు విస్తృతమైన వైమానిక రక్షణ గొడుగును ఆక్టివ్ చేశాయి. నియంత్రణ రేఖ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకూ విస్తరించి ఉన్న వేయికి పైగా విమాన నిరోధక తుపాకులు మోహరించారు.
పెద్ద పెద్ద వైమానిక ముప్పును ఎదుర్కొనేందుకు రూపొందించిన 750 కి పైగా స్వల్ఫ శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల వ్యవస్థలను మోహరించి అనేక రక్షణ మరింత బలోపేతం చేశారు.
భారత సరిహద్దులోకి చొరబడిన ప్రతి వైమానిక లక్ష్యాన్ని పర్యవేక్షించడం ట్రాక్ చేయడం, వాయు రక్షణ బ్యాటరీలకు సమాచారాన్ని చేరవేయడం ద్వారా ఇంట్రిగ్రేటేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రభావాన్ని ఆకాశ్ టిర్ వ్యవస్థ గణనీయంగా పెంచింది. కొన్ని నెలల క్రితం ఆకాశ్ టిర్, వైమానిక దళం ఇంటిగ్రేటేడ్ ఏరియల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లను ఆకాశ్ టిర్ ప్రాజెక్ట్ కింద చేర్చారు.


Read More
Next Story