యూపీలో సీట్ల పంపకంపై తేలని పంచాయితీ..
x
అఖిలేష్ యాదవ్

యూపీలో సీట్ల పంపకంపై తేలని పంచాయితీ..

అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. విపక్ష కూటమిలో సీట్ల పంపకం వ్యవహారం మాత్రం అప్పుడే వేడెక్కింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ).. సీట్ల పంపకంపై తుది ఒప్పందం కుదరకముందే అభ్యర్థుల ప్రకటనకు శ్రీకారం చుట్టింది. మంగళవారం రాత్రి ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌తో రెండో విడత చర్చలు ముగిసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అభ్యర్థుల జాబితా విడుదలకు కొద్దిసేపటి ముందు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించి, దేశం తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి రెండు లౌకిక పార్టీలకు ఇదొక చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఇప్పటికే 26 స్థానాలను ఆఫర్ చేశామని, మరికొన్ని స్థానాల విషయంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఎస్పీ ప్రకటించిన తొలి జాబితాలో సహరన్‌పూర్ జిల్లాలోని బెహత్ నియోజకవర్గం నుంచి ఉమర్ అలీఖాన్, షామ్లీ జిల్లాలోని కైరానా నుంచి మహబూబ్ అలీ, లలిత్‌పూర్ నుంచి జ్యోతి లోధి పోటీ చేయనున్నారు. అయోధ్య నుంచి తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండే పేరును పార్టీ గత ఆగస్టులోనే ప్రకటించింది.

మరోవైపు కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. మంగళవారం ఢిల్లీలో ఇరు పార్టీల నేతలు నియోజకవర్గాల వారీగా సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది. త్వరలో మరో రెండు విడతల చర్చలు జరిపి సీట్ల పంపకం ఒప్పందాన్ని ఖరారు చేయగలమని ఇరు పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎస్పీ కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం సుమారు 130 నియోజకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందించినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల మధ్య ఆశించిన స్థాయిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు.

2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేయాలని భావిస్తున్న ఎస్పీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఇప్పుడు కీలకంగా మారింది. చర్చలు ఇంకా కొనసాగుతుండగానే ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడం.. ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు ఏ దిశగా సాగుతాయన్న ఆసక్తిని పెంచుతోంది.

Read More
Next Story