ఢిల్లీలో ‘మట్కాఫోడ్’ నిర్వహించిన కాంగ్రెస్.. అంటే ?
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శనివారం మట్కాఫోడ్ నిర్వహించింది. ప్రజలను వేధిస్తున్న నీటి కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
దేశ రాజధానిలో నీటి కొరత రాజకీయ మలుపు తీసుకుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు దీనిపై ఢిల్లీ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలకు దిగింది. శనివారం ఢిల్లీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ‘మట్కా ఫోడ్’ నిరసనలు నిర్వహించి, ఖాళీ మట్టి కుండలను నేలకు పగలగొట్టారు.
ఢిల్లీలోని మొత్తం 280 బ్లాకుల్లో ఉదయం 10 గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి. తలపై మట్టి కుండలు, కాంగ్రెస్ జెండాలను పట్టుకుని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కుండలను నేలపై విసిరారు. నిరసనల్లో పాల్గొన్న ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నగరంలో నీటి కొరతను తీర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని, దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందని ఆయన శుక్రవారం ఆరోపించారు.
బీజేపీపై ఆప్ విమర్శలు
కాగా ఢిల్లీ లో నీటి ఎద్దడిపై హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆప్ మంత్రి అతిషీ ఆరోపించారు. అందువల్ల యమునా నదిలో నీరు తక్కువగా చేరిందని ఇదే ఢిల్లీలో నీటికొరతకు కారణమయిందని జలమంత్రిత్వశాఖ మంత్రి ఆరోపించారు. హర్యానా ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి రావాల్సిన నీటి కోటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నీటి డేటాను అతిషీ వివరిస్తూ, జూన్ 6న నీటి ఉత్పత్తి రోజుకు 1,002 మిలియన్ గ్యాలన్లు (MGD)గా ఉందని, అది మరుసటి రోజు 993 MGDలకు, జూన్ 8న 990 MGDలకు తగ్గిందని ఆమె చెప్పారు.
జూన్ 9న 978 ఎంజీడీలు, మరుసటి రోజు 958 ఎంజీడీలు నమోదైంది. జూన్ 11, 12, 13 తేదీల్లో నీటి ఉత్పత్తి వరుసగా 919 ఎంజిడి, 951 ఎంజిడి, 939 ఎంజిడిలు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం నీటిని తగినంతగా ప్రజలకు అందించలేకపోతుందని వివరించారు.
Next Story