యూపీ: మసీదు ముందు హనుమాన్ చాలీసా.. కళాశాలలో నమాజ్ పై వివాదం
x

యూపీ: మసీదు ముందు హనుమాన్ చాలీసా.. కళాశాలలో నమాజ్ పై వివాదం

కళాశాలలో ఉన్న మసీదులో బయటి వ్యక్తులు వచ్చి నమాజ్ పేరుతో గుమిగూడటం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.


వారణాసి( కాశీ) లోని ఉదయ్ ప్రతాప్ కళాశాల ఆవరణలో ఉన్న మసీద్ లో బయటి వ్యక్తులు వచ్చి నమాజ్ చేయాడాన్ని నిరసిస్తూ కళాశాల విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఈ విషయం క్రమక్రమంగా ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో పోలీసులు కళాశాలలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. గుర్తింపు కార్డులు ఉన్న విద్యార్థులు, ఇతర వ్యక్తులు మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు.

మంగళవారం మసీదులో బయటి వ్యక్తులు వచ్చి నమాజ్ చేస్తున్న సందర్భంలో విద్యార్థులు వచ్చి హనుమాన్ చాలీసా పఠించారు. ఇది క్రమంగా అశాంతికి దారి తీసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన తరువాత ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కళాశాల ఆవరణలోని మసీదు దగ్గర హనుమాన్ చాలీసా పఠించడం పట్ల విద్యార్థులు పట్టుదలతో ఉన్నారని వారణాసి కాంట్ ఏరియా అదనపు పోలీసు కమిషనర్ విదుష్ సక్సేనా తెలిపారు.
పోలీసులు వారిని శాంతింపజేసి వెనక్కి పంపించినట్లు తెలిపారు. సాయంత్రం విడుదల చేసిన ఏడుగురు విద్యార్థులను కూడా పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
బయటి వ్యక్తులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ..
ఉదయ్ ప్రతాప్ కాలేజీకి చెందిన విద్యార్థి నాయకుడు వివేకానంద్ సింగ్ ప్రార్థనలు చేయడానికి మసీదు వద్ద "బయటి వ్యక్తులు" గుమిగూడడాన్ని నిరసిస్తూ మంగళవారం హనుమాన్ చాలీసా పఠించారని పేర్కొన్నారు.
ఇక్కడి విద్యార్థులు కళాశాల ఆవరణలోని మసీదు, గుడిలో నమాజ్ చేసినా, పూజలు చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే కళాశాల ఆవరణలో నమాజ్ పేరుతో బయటి వ్యక్తులు గుమికూడడాన్ని అంగీకరించబోమని చెప్పారు.
వివేకానంద్ సింగ్ గురువారం మాట్లాడుతూ, "కాలేజ్ గేట్ వద్ద పోలీసు సిబ్బంది ఉన్నారు, బయటి వ్యక్తులు ఎవరూ క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా ఉండేలా గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల బృందం కూడా గేట్‌ను పర్యవేక్షిస్తోంది." అని చెప్పారు.
గురువారం నమాజ్ చేయడానికి ఎవరూ రాలేదని, శుక్రవారం (డిసెంబర్ 6) "జుమ్మా" ప్రార్థనల సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్యాంపస్‌లోకి ప్రవేశించిన వారి ధృవీకరణను కోరుతూ కళాశాల యాజమాన్యం పరిపాలనను సంప్రదించిందని, తదుపరి అంతరాయాలను నివారించడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.
సంబంధిత పరిణామంలో, కళాశాల విద్యార్థులు "విద్యార్థి కోర్టు"ను ఏర్పాటు చేసి, ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు 11 పాయింట్ల లేఖను పంపారు, మసీదు స్థితి, దాని యాజమాన్యం గురించి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ప్రస్తుత వివాదానికి కారణం లేదు'
అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ యాసీన్, మసీదు స్థితిని మంగళవారం నాడు తనిఖీ చేయాలని ఉత్తరప్రదేశ్ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిపారు.
"మసీదును వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ 2018లో ఇచ్చిన నోటీసును జనవరి 18, 2021న రద్దు చేశామని ఉత్తరప్రదేశ్ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుత వివాదానికి కారణం లేదు" అని యాసీన్ పేర్కొన్నారు.
క్యాంపస్‌లో ఉన్న మసీదును టోంక్ నవాబ్ వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారని, ఆ స్థలం వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ 2018లో ఇన్‌స్టిట్యూట్‌కి నోటీసు పంపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డీకే సింగ్ తెలిపారు.
వారణాసి నివాసి వసీం అహ్మద్ ఖాన్ నుంచి నోటీసు వచ్చిందని సింగ్ చెప్పారు. నోటీసుకు సమాధానంగా, కళాశాల అడ్మినిస్ట్రేషన్ మసీదు చట్టవిరుద్ధంగా నిర్మించబడిందని, కళాశాల ఆస్తి ట్రస్ట్‌కు చెందినదని, దానిని కొనడం లేదా విక్రయించడం సాధ్యం కాదని చెప్పారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో 2022లో మసీదు నిర్మాణ పనులను నిలిపివేసినట్లు వరుణ మండలం డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ చంద్రకాంత్‌ మీనా తెలిపారు.



Read More
Next Story