
జాట్ సినిమాలో కథానాయకుడు సన్నీ డియోల్
‘జాట్’ సినిమా హీరో సన్నీడియోల్ తో పాటు గోపిచంద్ మలినేనిపై కేసు
సినిమాలోని సన్నివేశాలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదు, నిర్మాత, విలన్ పై కూడా..
తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలీవుడ్ లో తొలిసారిగా తీసిన చిత్రం ‘జాట్’. సన్నిడియోల్ హీరోగా, రణదీప్ హుడా విలన్ గా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రం పై కేసు నమోదు అయింది. ఇందులో ఓ సన్నివేశం క్రైస్తవుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని పోలీసు కేసు నమోదు అయింది.
హీరో, విలన్, డైరెక్టర్ తో పాటు నిర్మాత నవీన్ యెర్నేనిలపై కూడా పోలీసు కేసు పెట్టారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) లోని సెక్షన్ 299 కింద మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన, హానికారకమైన చర్యలు ఉన్నాయని ఫిర్యాదు అందింది.
వివాదాస్పద సన్నివేశాలు..
ఫోల్డివాల్ గ్రామ నివాసి అయిన వికల్ప్ గోల్డ్ అనే ఫిర్యాదుదారుడు సినిమాలోని ఒక సిలువ వేసే సన్నివేశం యేసు క్రీస్తును అపహాస్యం చేసే విధంగా ఉందని, పవిత్ర స్థలాన్ని అవమానించే విధంగా ఉందని పేర్కొన్నాడు.
వివాదాస్పద సన్నివేశంలో హుడా విలన్ పాత్రను పోషిస్తూ.. పవిత్ర వేదికపై ఉన్న శిలువ కింద ఉన్నట్లు చూపగా, కింద విశ్వాసులు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నట్లు చూపిస్తుంది.
ఈ సన్నివేశం చర్చి ప్రాంగణంలో గూండాయిజం, బెదిరింపు చర్యలను కూడా చిత్రీకరిస్తుందని, ఇది సమాజానికి హాని కలిగించే విధంగా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నిరసనలు..
పంజాబ్ లోని క్రైస్తవ సమాజం సభ్యులు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు ఫిర్యాదు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పవిత్ర సమయంలో కోపాన్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఈ సన్నివేశాలను చొప్పించారని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు.
మంచి కలెక్షన్లు..
వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ‘జాట్’ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి వారంలోనే సినిమా రూ. 61.5 కోట్లను కలెక్ట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ హిందీ సినిమా, తమిళం, తెలుగు భాషలలో విడుదల అయింది. డాన్ శ్రీను, క్రాక్, వీరసింహారెడ్డి వంటి తెలుగు హిట్ చిత్రాలను తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమా ద్వారా బాలీవుడ్ అరంగ్రేటం చేశారు.
Next Story