ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ వర్సెస్ కేజ్రీవాలేనా?
అవినీతి చుట్టూ ఎన్నికల ప్రచారం తిరిగేలా బీజేపీ వ్యూహం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో కొన్ని రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే అంతకుముందే ఇక్కడి ప్రధాన ప్రత్యర్థులైన ఆప్, బీజేపీ తమ పరస్పర విమర్శలతో అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాయి.
గత దశాబ్ధం నుంచి ఢిల్లీ అసెంబ్లీ పీఠం పై కూర్చున్న ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ విమర్శలను ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ యమునా ప్రక్షాళన వలన ఓట్లు రావని ప్రచారం చేస్తోందని కానీ లిక్కర్ స్కామ్ ను ప్రోత్సహించి ఆ పార్టీ అధినేత జైలులో ఉన్నారని విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా కేజ్రీవాల్ సైతం ఘాటుగా ప్రతిస్పందించారు.
అవినీతి ఆరోపణలతో మోదీ..
ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అపార్ట్ మెంట్లను ప్రధాని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొంత కాలంగా అధికారంలో ఉన్న ఆప్ అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ ప్రభుత్వం విపత్తులా వచ్చిందని అన్నారు. గత దశాబ్ధకాలంగా దేశంలోని అత్యున్నత కార్యాలయాన్ని ఆక్రమించారని విమర్శించారు. కొంతమంది తమకోసం ‘ శీష్ మహాల్ ’ నిర్మించుకున్నారు. తమ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించిందని అన్నారు. ఎవరూ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ ఎన్నికలు మొత్తం అవినీతి చుట్టే తిరుగుతాయని అన్నారు.
శీష్ మహాల్ అంటే ఏంటంటే...
ఢిల్లీ సీఎం ఉండే అధికారిక నివాసాన్ని ‘శీష్ మహాల్’ అంటారు. ఈ నివాసాన్ని అధికారికంగా ఆప్ ప్రభుత్వ వాడుకుంటోంది. ముఖ్యమంత్రి గా కేజ్రీవాల్ ఉన్న సమయంలో దీనిని భారీ ఖర్చుతో పునరుద్దరించారు. దీనిపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఇంటిలోకి వచ్చిన కొన్ని రోజులకే సీఎం ఆతిశీ మార్లేనా, బ్యూరోక్రసీ తిరిగి ఖాళీ చేశారు. ఈ బంగ్లాను ఖాళీ చేసిన కొన్ని రోజులకే వీటి వీడియోలను బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విజయేందర్ ‘ ది ఫెడరల్ ’ తో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అవినీతిపై ఆప్ ఆడుతున్న నాటకాన్ని ఢిల్లీ ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. అవినీతిని రూపు మాపుతామని వచ్చి ఇప్పుడు అందులోనే పీకల్లోతూ కూరుకుపోయిందని అన్నారు.
బీజేపీ ఈసారి సాధిస్తుందా?
బీజేపీ చివరిసారిగా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఢిల్లీ పీఠాన్ని అధిష్టించింది. తరువాత కాంగ్రెస్ చేతికి చిక్కింది. ఆ తరువాత కేజ్రీవాల్ పాలన మొదలైంది. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించట్లేదు.
అయితే ఈసారి పరిస్థితి మాత్రం ఆప్ కు అనుకూలంగా లేదు. మొత్తం అధినాయకత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ స్వయంగా జైలుకి వెళ్లి వచ్చారు. తరువాత అపెక్స్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలను అన్నింటిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది.
ఆప్ ఎదురుదాడి...
ప్రధానమంత్రి తనపై ఆరోపణలు చేసిన ఆప్ అధినేత కూడా విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు గుజరాత్ వ్యాపారి నరేంద్ర మోదీకి ఇచ్చిన రూ. 10 లక్షల సూట్ ధరించారని, రూ. 2,700 కోట్ల తో ఇళ్లు, 8,400 కోట్ల ఖరీదైన విమానంలో తిరుగుతున్నారని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కొత్తగా ప్రధాన మంత్రి నివాసాన్ని నిర్మించుకోవడం ఏంటనీ ప్రశ్నించారు.
ఇలా ఇద్దరు నాయకులు చలిలో వణుకుతున్న ఢిల్లీలో రాజకీయ వేడిని రాజేశారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ, మీరే అవినీతిలో చిక్కుకుపోయారని ఆప్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీనిపై ఢిల్లీ ప్రజలు నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story