అశోక చిహ్నం ధ్వంసం కేసు: పోలీసులు అదుపులో 50 మంది
x
శ్రీనగర్ లోని హజ్రత్ బాల్ మసీదు

అశోక చిహ్నం ధ్వంసం కేసు: పోలీసులు అదుపులో 50 మంది

జమ్మూకాశ్మీర్ లో శుక్రవారం ప్రార్థనల తరువాత జాతీయ చిహ్నం ధ్వంసం చేసిన ఇస్లామిస్టులు


శ్రీనగర్ లోని హజ్రత్ బాల్ మందిరంలో అశోక చిహ్నం ఉన్న ఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

సంఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ వారం ప్రారంభంలో మందిరంలో జాతీయ చిహ్నాన్ని పెట్టడం పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్దమని వాదించారు. జాతీయ చిహ్నం పెట్టిన తెల్లవారి అంటే శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కొందరు దుండగులు దీనిని ధ్వంసం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారని అధికారులు తెలిపారు. ‘‘ఇప్పటి వరకూ అధికారికంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు’’ అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

జాతీయ చిహ్నం ధ్వంసం చేసిన ఘటనలో పాల్గొన్న మహిళలపై కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, అయితే మైనర్ లు ఉంటే వాటిని పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.
వివాదానికి కేంద్రంగా దరక్షన్ ఆండ్రాబీ
కాశ్మీర్ లోని హజ్రత్ బాల్ మందిరంలో అశోక చిహ్నం ఉన్న ఫలకం ధ్వంసం చేసిన తరువాత పెద్ద వివాదం చెలరేగింది. వక్ఫ్ బోర్డ్ చీఫ్ దరక్షన్ ఆండ్రాబీ మసీద్ లో జాతీయ చిహ్నం ఉపయోగించడం ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని రాజకీయ పార్టీలు ఆరోపించాయి.
ఆమె పై వెంటనే కేసు నమోదు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఆండ్రాబీ ఎదురుదాడికి దిగారు. జాతీయ చిహ్నాన్ని ధ్వంసం చేసినందుకు కఠినమైన ప్రజాభద్రతా చట్టం కింద దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి స్పందించారు. జాతీయ చిహ్నం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అని మతపరమైన సంస్థలకు కాదని, వక్ప్ బోర్డు దీనికి క్షమాపణ చెప్పాలని అన్నారు.
మసీదు లో అశోక చిహ్నం ఉపయోగించడం రెచ్చగొట్టేది, దైవ దూషణ అని ఎన్సీ,పీడీపీ, సీపీఐ నాయకులు అన్నారు. అయితే జాతీయ చిహ్నాన్ని ధ్వంసం చేయడం పై బీజీపీ గట్టిగా వ్యతిరేకించింది. ఈ సంఘటన లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని పునరుద్దరించే ప్రయత్నం అని ఆరోపించింది.
హజ్రత్ బాల్ మందిరం లోపల అశోక చిహ్నాం..
ప్రవక్త మహ్మద్ అవశేషాలు ఉన్న హజ్రత్ మందిరం లోపల ఈ ఫలకాన్ని పెట్టడం పై ఇస్లామిస్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు లోపల వేరు బొమ్మలు పెట్టడం, చిహ్నాన్ని నిలపడం ఇస్లామిక్ ఏకేశ్వరోపాసన సూత్రానికి విరుద్దమని అన్నారు.
శుక్రవారం ప్రార్థనల తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫలకాన్ని ధ్వంసం చేసి తొలగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఏ మతపరై ప్రదేశంలోనూ ఈ విధమైన చిహ్నాన్ని ఉపయోగించడం నేను ఎప్పుడూ చూడలేదు.
మసీదులు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, గురుద్వారాలు ప్రభుత్వ సంస్థలు కావు. ఇవి మతపరమైన సంస్థలు, ప్రభుత్వ చిహ్నాలను మతపరమైన సంస్థలలో ఉపయోగించరు’’ అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.


Read More
Next Story