ఛత్తీస్ గఢ్ లో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు, తొమ్మిది మంది జవాన్ల మృతి
అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్ తరువాత తిరిగి వస్తున్న నేపథ్యంలో దాడి
ఛత్తీస్ గఢ్ లో వామపక్ష తీవ్రవాదులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలోని జవాన్లు ప్రయాణిస్తున్న వాహానాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ కు చెందిన ఎనిమిది మంది జవాన్లు సహ, వాహన డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
యాంటీ నక్సలైట్ల ఆపరేషన్ అనంతరం భద్రతా సిబ్బంది తమ స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా, కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలో ఈ బాంబు దాడి జరిగినట్లు బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పేర్కొన్నారు.
భారీ పేలుడు...
పేలుడు ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. చనిపోయిన సైనికులంతా మావోయిజాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగమైన రిజర్వ్ గార్డ్ దళానికి చెందినవారు. గత రెండేళ్ల కాలంలో నక్సలైట్లు జరిపిన అతి పెద్ద దాడి ఇదే అని అధికారి తెలిపారు. చివరిగా ఏప్రిల్ 26, 2023 న దంతెవాడ జిల్లాలోని భద్రతా సిబ్బందిని తీసుకు వెళ్తున్న కాన్వాయ్ ను ఇలాగే ఐఈడీతో పేల్చి వేయడంతో పదిమంది భద్రతా జవాన్లు, ఓ పౌర డ్రైవర్ మరణించారు.
ఎన్ కౌంటర్ తరువాత దాడి..
అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళలు, ఐదుగురు నక్సలైట్లు హతమారిన తరువాత డీఆర్జీ జవాన్లు తిరుగుప్రయాణమయ్యారు. నారాయణపూర్ , దంతెవాడ జిల్లాల సరిహద్దులో దక్షిణ అబూజ్ మడ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ ప్రాంతంలో ఏకే 47 రైఫిల్స్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్లు పరారీలో ఉన్నారని, త్వరలో వారందరిని తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పదే పదే ప్రతిజ్ఞ చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
ఈ దాడి పై ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో మాట్లాడుతూ.. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించారు. సైనికుల త్యాగం వృథా పోదని అన్నారు. మార్చి 2026 నాటికి బస్తర్ ను నక్సలిజం నుంచి విముక్తి చేస్తామని, మా ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేరుస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు.
Next Story