తూర్పు లఢక్ పెట్రోలింగ్ పై భారత్- చైనా మధ్య కుదిరిన అంగీకారం
x

తూర్పు లఢక్ పెట్రోలింగ్ పై భారత్- చైనా మధ్య కుదిరిన అంగీకారం

గత కొన్ని సంవత్సరాలుగా భారత్- చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి.


భారత్- చైనా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా నెలకొని ఉన్న ఉద్రిక్తతలు క్రమక్రమంగా చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకుంటున్నాయి. తాజాగా తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ( ఎల్ఎసీ) వెంట ఇరు దేశాలు పెట్రోలింగ్ పై ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెండు దేశాలకు చెందిన మిలిటరీ అధికారులు ఈ ఒప్పందం పై పూర్తి స్థాయిలో చర్చలు జరపబోతున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

మిస్రీ మాట్లాడుతూ “భారత్- చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందం కుదిరింది. ఇది 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి దారితీసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటున్నాం." అని వెల్లడించారు. మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి గత కొన్ని వారాలుగా భారత్, చైనా చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
దేప్సాంగ్ ప్లేన్స్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. అక్టోబర్ 22న బ్రిక్స్ సమ్మిట్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యాలోని కజాన్‌కు వెళ్లనున్న నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి ప్రకటన వెలువడింది. ఈ చర్య మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశానికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మిస్రీ తెలిపారు. "బ్రిక్స్ సమ్మిట్‌కు వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా హాజరవుతారు. అక్టోబరు 22న సమ్మిట్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు సాయంత్రం నాయకులకు మాత్రమే విందు ఉంటుంది.
సమ్మిట్ అక్టోబర్ 23న జరుగబోతోంది. అక్కడ రెండు ప్రధాన సెషన్‌లు జరుగుతాయి. ఉదయం దేశాధినేతలు, ప్రధాన అధికారులతో ఓ ప్లీనరీ, మధ్యాహ్నం సమ్మిట్ ప్రధాన ఇతివృత్తానికి చెందిన బహిరంగ ప్లీనరీ, బ్రిక్స్‌కు మార్గం చూపే కజాన్ డిక్లరేషన్‌ను కూడా నాయకులు స్వీకరించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.’’ అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
గాల్వాన్ ఘర్షణ తరువాత ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధం వంటి పరిస్థితులు ఎదురైయ్యాయి. మన దేశానికి చెందిన 21 మంది సైనికులను చైనా సైనికులు దాడి చేసి హతమార్చారు. తరువాత భారత్ జరిపిన దాడిలో దాదాపు 120 నుంచి 150 వరకూ పీఎల్ఏ సైనికులు మరణించారని విదేశీ మీడియా నివేదికలు వెల్లడించాయి.
చైనా మాత్రం సంవత్సరం తరువాత కేవలం ముగ్గురు మాత్రమే చనిపోయారని ప్రకటించింది. చాలా సార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను కలవడానికి నిరాకరించారు. అలాగే చైనాతో వాణిజ్యం విషయంలో కూడా న్యూఢిల్లీ సుముఖంగా లేదు. చైనా జీడీపీ పడిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్న మాట.


Read More
Next Story