ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ బడ్జెట్ లేదు.. ఎందుకని !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. పేరుకు మాత్రమే బడ్జెట్ సమావేశాలు. కానీ బడ్జెట్ లేని సమావేశాలుగా మిగిలాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉందంటున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. చట్టపరంగా చేయొచ్చు. కానీ బాధ్యత పరంగా మంచిది కాదని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితులపై మాకు ఇంకా స్పష్టత రాలేదని, ఆ స్పష్టత వచ్చిన తరువాతనే బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పడం బాధ్యత అనిపించుకోదన్నారు.
బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు..
చట్టపరంగా గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగించవచ్చు. లేదా కొత్తగా ప్రవేశపెట్టవచ్చు. కానీ ప్రభుత్వ బాధ్యత అది కాదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైందంటే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. లోటు ఉండవచ్చు. మిగులు ఉండవచ్చు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నడిచే ప్రభుత్వం ఇదేనని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఈ విధమైన పద్ధతి కొనసాగలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే నష్టం ఏమిటనేది పలువురి ప్రశ్న. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడితే ఏ శాఖకు ఎంత మొత్తం నిధులు కేటాయించారో ఆ శాఖ ద్వారా మాత్రమే ఆ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్వల్పకాలిక బడ్జెట్ వల్ల అవసరమైన మార్పులు చేసుకునేందుకు వీలు ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టని బడ్జెట్‌ను మరో మూడు నెలల పాటు కొనసాగించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపించి ఆమోదింప చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగిస్తామని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడం చట్ట బద్దత అనిపించుకోదని ప్రకటించలేదు. గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి?
భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 116 ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ అనేది ప్రభుత్వం స్వల్పకాలిక ఖర్చులు చేసుకోవడానికి ముందస్తుగా తీసుకునే గ్రాంట్ మాత్రమే. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు కొన్ని నెలల పాటు ఇది అమలులో ఉంటుంది. ఓటాన్ అకౌంట్ విలువ మొత్తం వ్యయంలో 1/6 వంతు ఉంటుంది.
ఇంకా లెక్కలు తేలలేదా?
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు లెక్కలు తేలడం లేదని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పలువురు ఆర్థశాస్త్ర నిపుణులు అంటున్నారు. వందల మంది ఐఏఎస్‌లు ప్రభుత్వంలో ఉన్నారు. వారు అనుకుంటే రాబడులు, ఖర్చులు తేల్చడం పెద్ద లెక్కలోనిది కాదు. నిజానికి లెక్కలు తేలుస్తూ పరిస్థితి ఇలా ఉందని, పాలన సాగించాలంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రజలకు చెప్పుకోవచ్చు. అంతే కాని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పరిస్థితులు చక్కబడే అవకాశం లేదు.
Next Story