నేను బతికుండగా బెంగాల్ లో ‘సీఏఏ’ను అమలు కానివ్వ: మమతా బెనర్జీ
x

నేను బతికుండగా బెంగాల్ లో ‘సీఏఏ’ను అమలు కానివ్వ: మమతా బెనర్జీ

బెంగాల్ లో సీఏఏను అమలు కానివ్వని బెంగాల్ సీఎం శపథం చేశారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ పొత్తులో ఉన్నాయని ఆమె ఆరోపించారు.


తాను బతికి ఉన్నంత వరకూ బెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship (Amendment) Act ) సీఏఏ ను అమలు చేయలేరని, తాను చేయనివ్వనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు బీజేపీ సీఏఏను తిరగదోడుతోందని విమర్శించారు.

ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని రాయ్ గంజ్ లో మంగళవారం నిర్వహించిన ప్రజాపంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. "వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకు మాత్రమే బీజేపీ ఈ సీఏఏను ముందుకు తెచ్చింది. అయితే నేను జీవించి ఉండగా దానిని బెంగాల్ లో అమలుకానివ్వను. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాను" అని పేర్కొన్నారు.

దేశ సరిహద్దు ప్రాంతంలోని బీఎస్ఎఫ్ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. దీనిని ప్రజలు ఆమోదించవద్దని, వీటిని ఎన్ఆర్సీ లో భాగంగా అందజేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఖండించింది.

మేము ఎలాంటి కార్డులను అందించడం లేదని వారు ప్రకటించారు. బెంగాల్ లో సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు ఉందని, దానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. టీఎంసీని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారీటితో గెలిపించాలని కోరారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది.

ఆదివారం బెంగాల్ లోని దక్షిణ 24 పరగణ జిల్లాలోని కక్ దీప్ బహిరంగ సభలో కేంద్రమంత్రి శంతను ఠాకూర్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా అమలు చేస్తానని ప్రకటించారు. ఇది దేశంలోని రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది.

2019 లో కేంద్ర ప్రభుత్వం సీఏఏ రూపొందించింది. భారత్ ఉపఖండ దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్గానిస్తాన్ నుంచి హింసకు గురైన హిందూవులు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శీలు, క్రైస్తవులతో సహ ఇస్లామేతర వలసదారులు 2014, డిసెంబర్ 31 లోపు దేశంలో ఉంటే వారికి పౌరసత్వం మంజూరు చేసేలా నిబంధనలు రూపొందించారు.

Read More
Next Story