పశ్చిమ బెంగాల్ లో ఖర్గే పోస్టర్లకు మసిపూశారెందుకు?
x

పశ్చిమ బెంగాల్ లో ఖర్గే పోస్టర్లకు మసిపూశారెందుకు?

పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో సంబంధాలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. పార్టీ హైకమాండ్ ఆలోచనకు భిన్నంగా రాష్ట్ర పార్టీ నాయకత్వ యోచన ఉంది.


పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో సంబంధాలపై కాంగ్రెస్ లో 'ప్రచ్ఛన్న యుద్ధం' కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు పోస్టర్లపైకి మళ్లింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లకు మసిపూసి ఆయన మొఖం కనిపించకుండా చేయడమే ఇందుకు నిదర్శనం. ఆదివారం (మే 19) కోల్‌కతాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పెట్టిన పోస్టర్లపైన్నే మల్లికార్జున ఖర్గే చిత్రాలకు మసిపూయడం గమనార్హం. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఫోటోలున్న ఫ్లేక్సీలకు మసిపూయడంతో పాటు బ్యానర్‌లపై 'టీఎంసీ దలాల్' (టీఎంసీ ఏజెంట్) అని కూడా రాశారు.

చౌదరికి చురకలంటించిన ఖర్గే

టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు. అయితే ఆ విధేయతను విశ్వసించలేమని, ఎన్నికల తర్వాత ఆమె బిజెపితో చేతులు కలిపే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యను ఖర్గే తప్పుబట్టిన 24 గంటల వ్యవధిలోనే ఇది జరిగింది.

ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. మసిపూసి ఉన్న ఫోటోలను తీసేసి పాలతో శుద్ధి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల తర్వాత వచ్చే సమీకరణాలపై టీఎంసీకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ మధ్య తీవ్రమైన విభేదాలే ఉన్నట్టు స్పష్టమవుతోంది ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

పార్టీ అధ్యక్షుడి మందలింపునకు ఏమాత్రం బెదరని చౌదరి ఆదివారం (మే 19) మరోసారి తన వాదనను వినిపించారు. బెంగాల్‌లో పార్టీ ప్రయోజనాలను కాపాడటానికి టిఎంసికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.

“బెంగాల్‌లో నన్ను, నా పార్టీని రాజకీయంగా అంతం చేయాలనుకునే ఆ మహిళకు (మమతా బెనర్జీ పేరు ప్రస్తావించకుండా) అనుకూలంగా మాట్లాడలేను. అందులో నా సొంత ప్రయోజనమేమీ లేదు. పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉన్న సైనికునిగా నేనీ పోరాటం చేస్తున్నా. ఇదో నైతిక యుద్ధం” అధిర్ నొక్కి చెప్పాడు.

మమత-అధీర్ మధ్య వైరమేమిటీ..

మమతా బెనర్జీ, అధిర్ చౌదరి మధ్య రాజకీయ పోరాటం ఈ నాటిది కాదు. 1990ల నాటిది. వీరిద్దరూ కాంగ్రెస్‌లో వర్ధమాన తారలుగా ఉన్నప్పటి నుంచే వీరి మధ్య విభేదాలున్నాయి.

1996లో జైలు నుంచి పోటీ చేసిన అధిర్ రంజన్ చౌదరి నబగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి వార్తల్లో వ్యక్తిగా, జైలు నుంచే గెలిచిన నాయకుని ఖ్యాతి గడించారు. సిపిఐ(ఎం) కార్యకర్త హత్యకేసులో ఆయన జైలుకెళ్లారు. అధీర్ కి సీటు ఇవ్వడాన్ని ఆనాడు మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య వైరం మొదలైంది.

ఇకనిప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నారు. ఒకప్పటి వ్యతిరేకత వ్యక్తిగతమనుకుంటే ఇప్పటిది రాజకీయాలకు సంబంధించింది.

పార్లమెంటు ఎన్నికలకు ముందు టిఎంసి అధిష్టానం.. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఒకింత తృణీకారభావంతోనే కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావన్నట్టుగా మాట్లాడింది. ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో ఓపక్క చర్చలు జరుగుతున్న సమయంలోనే టీఎంసీ ఈ ప్రకటన చేయడం ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత లేదన్నది స్పష్టమైంది.

టీఎంసీని కుదిపేసింది?

ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో కూటమికి చుక్కెదురైంది. సరిగ్గా అదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్ నుంచి వెళుతున్నా టీఎంసీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పెట్టిన ఇండియా కూటమి సమావేశాలకు మమతా బెనర్జీ పార్టీ నేతలు హాజరుకాలేదు. ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి దూరంగా ఉన్నారు.

ఈలోగా, కాంగ్రెస్ హైకమాండ్ పశ్చిమ బెంగాల్ లో సీపీఐ (ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ తో ఒప్పందం కుదుర్చకుంది. 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 42 పార్లమెంట్‌ స్థానాల్లో 30 స్థానాల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ పోటీ చేస్తోంది.

పోలింగ్ ప్రారంభమై తొలి, మలిదశల తర్వాత టీఎంసీ వ్యూహకర్తలకు మైనారిటీ ఓట్ల బెంగపట్టుకుంది. తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దశాబ్దం పాటు బెంగాల్‌లో టీఎంసీ పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. దాదాపు 15 పార్లమెంటు స్థానాల్లో ముస్లిం ఓటర్లు 30 శాతానికి పైగా ఉన్నారు.

కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మైనారిటీ ఓట్లలో గణనీయమైన భాగాన్ని కొల్లగొడుతుందన్న భావన టిఎంసిని భయపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో టీఎంసీ ఎన్నికల మధ్యలో దిద్దుబాటు ఆలోచన చేసినట్టు పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

మమత యూ-టర్న్

ఇండియా కూటమి పట్ల గతంలో ఉన్న తిరస్కార భావం నుంచి టీఎంసీ యూ టర్న్ తీసుకుంది. టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ మే 15న ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ... కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి తమ పార్టీ "బయటి మద్దతు" అందిస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలవదన్న నోటితోనే ఆమె ఈ ప్రకటన చేయడం టీఎంసీ విధానంలో వచ్చిన పెద్ద మార్పు.

ఆ తర్వాతి రోజే ఆమె.. టీఎంసీ కూడా ఇండియా కూటమిలో భాగంగా పునరుద్ఘాటించింది. ఆ కూటమి ఏర్పాటులో తన పాత్రా ఉందని చెప్పారు. కూటమికి ఇండియా అని పేరు పెట్టిందే తానని మమతా చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా మమత బెనర్జీ.. బిజెపికి తాము వ్యతిరేకమనే భావనను ముస్లింలో కల్పించి మైనారిటీ ఓటర్లలో సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేయడం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ యూనిట్, వామపక్ష పార్టీలకు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని కూడా ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో కాంగ్రెస్-వామపక్ష కూటమికి ఓటు వేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముస్లిం ఓట్ల కోసం హోరాహోరీ...

బిజెపి వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయాలనే మమతా బెనర్జీ వ్యూహానికి కౌంటర్‌గా అధీర్ రంజన్ రంగంలోకి దిగారు. టీఎంసీ చేపట్టిన బిజెపి వ్యతిరేక ప్లాంక్ నమ్మదగినది కాదని చౌదరి సరి కథనాన్ని ముందుకు తెస్తున్నారు.

"ఆమె ఇండియా కూటమిని వదులుకున్నందున ఆమెను విశ్వసించలేం," అని ఆయన అన్నారు. ఆమె బిజెపి వైపు కూడా వెళ్ళవచ్చు. కాషాయ పార్టీతో పోరాడే విషయంలో ఆమె చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అధీర్.

“మమతా బెనర్జీ తాను ఇండియా కూటమిలో భాగమని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, లెఫ్ట్ ఫ్రంటే ఇండియా కూటమిలో భాగం కాదంటూ ఓటర్లను గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముస్లింల ఓట్లు లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి వైపు మొగ్గుచూపుతున్నందునే ఆమె ఇలాంటి అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

బద్ధ శత్రువుల్లా మారిన మమత, చౌదరి ముస్లింల ఓట్ల కోసం అనేక రకాల విన్యాసాలు చేస్తున్నారు. నిజానికి ఈ రెండు పార్టీలకు ముస్లిం మైనారిటీల ఓట్లే ప్రధానం. ఎక్కువగా వారిపైన్నే ఆధారపడి ఉంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు.

దశాబ్దాలుగా అధికారంలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి.. ముస్లింలు అధికంగా ఉండే ముర్షిదాబాద్, మాల్దా, నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలపై పట్టుంది. బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేకించి ఎన్నికల్లో ఎంతో కొంత ఉనికిని చాటుకోగలిగిన సత్తా ఉంది. అయితే టీఎంసీ పలుకుబడి పెరిగిన తర్వాత ఈ మైనారిటీ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పట్టు కోల్పోవడం మొదలైంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లను తిరిగి పొందాలంటే టీఎంసీ మైనారిటీ ఓట్ బేస్‌ను బద్దలు కొట్టాలి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తుండడంతో ఈ రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది. మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.

'చౌదరి దీర్ఘకాలిక ఆలోచన'

“అధిర్దా (దాదా అనే పదానికి బెంగాలీలో చిన్నన్న అని అర్థం) బెంగాల్‌లో పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లుగా అర్ధమవుతోందని పేరు రాయడానికి ఇష్టపడని సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

మరోవైపు, న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌ ఆలోచన వేరుగా ఉంది. జాతీయ ప్రయోజనాల కోసం టిఎంసితో చేతులు కలపాల్సిన తక్షణ అవసరాన్ని పార్టీ అధిష్టానం చూసిస్తోంది.

ఇలాంటి విరుద్ధమైన ప్రాధాన్యతల మధ్య చిక్కుకున్న కాంగ్రెస్.. మమతతో, ఆమె పార్టీతో ఎలా వ్యవహరించాలనే దానిపై రెండుగా విడివడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చౌదరిని కట్టడిచేయలేక ఇటు మమతా బెనర్జీని ఏమనాలో తెలియక పార్టీ అధిష్టానం సతమతం అవుతుండడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది.

Read More
Next Story