‘రెమాల్’ విధ్వంసం - 35 మంది మృత్యువాత
x

‘రెమాల్’ విధ్వంసం - 35 మంది మృత్యువాత

రెమాల్ తుఫాను పెను విధ్యంసం సృష్టించింది. పదులు సంఖ్యలో మరణాలు సంభవించాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


రెమాల్ తుఫాను ఈశాన్య ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. నాలుగు రాష్ట్రాల్లో (మిజోరాం, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ) 35 మంది చనిపోయారు.

మిజోరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొండచెరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ మొత్తం 25 మంది మృత్యువాతపడ్డారు. ఐజ్వాల్ జిల్లాలోని ఒక క్వారీలోకి కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మైనర్లతో సహా కనీసం 14 మంది మరణించారు. ఎనిమిది మంది అదృశ్యమయ్యారని మిజోరాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (MSDMA) తెలిపింది.

తుఫాను ప్రభావంతో అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. 18 మంది గాయపడ్డారు.

నాగాలాండ్‌లో నలుగురు చనిపోయారు. 40 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి.

మేఘాలయలో ఇద్దరు మరణించగా మరో 500 మంది గాయపడ్డారు.

త్రిపురలో 746 మంది నిరాశ్రయులయ్యారు ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ. 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రవాణా మంత్రి సుశాంత చౌదరి తెలిపారు.


అస్సాంలోని సోనిత్‌పూర్‌లోని ధేకియాజులి వద్ద తుఫాను దాటికి స్కూలు బస్సుపై కూలిన చెట్టు

మిజోరాంలో కూలిన క్వారీ..

మిజోరంలోని ఐజ్వాల్ పట్టణ శివారులో కొండ చెరియలు విరిగి పడ్డాయి. దాంతో అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద 22 మంది సమాధి అయ్యాయని MSDMA పేర్కొంది. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. మృతులలో నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలిక కూడా ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ముఖ్యమంత్రి లాల్దుహోమ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

శిథిలాల తొలగింపు కొనసాగుతోందని ఐజ్వాల్ డిప్యూటీ కమిషనర్ నజుక్ కుమార్ తెలిపారు.

“పాడుబడిన గ్రానైట్ క్వారీ గత మూడు దశాబ్దాలుగా పనిచేయడం లేదు. క్వారీ సమీపంలోని ఇళ్లు కూలిపోయాయి.రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతోంది. ఇద్దరిని కాపాడామని ” అని మిజోరాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ శుక్లా తెలిపారు.


వరద సహాయక చర్యల్లో రెస్క్యూ టీం

అస్సాంలో..

అస్సాంలో రెమాల్ తుఫాను ధాటికి మంగళవారం వేర్వేరు ఘటనల్లో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

కమ్రూప్ (మెట్రోపాలిటన్) జిల్లా సత్గావ్ ప్రాంతం నబజ్యోతి నగర్‌లో ఓ ఇంటిపై చెట్టు కూలిన ఘటనలో19 ఏళ్ల మింటు తాలుక్దార్ మరణించాడు. అతని తండ్రి గాయపడ్డాడు. అదే జిల్లాలో చెట్టు కూలిన మరో ఘటనలో లాబణ్య కుమారి అనే 60 ఏళ్ల మహిళ గాయపడింది. ఆమెను గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో తరలించగా చికిత్సపొందుతూ చనిపోయారు.

లఖింపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో మరో వ్యక్తి పుతుల్ గొగోయ్ మరణించినట్లు అధికారులు తెలిపారు.


అగర్తల సమీపంలోని బిషాల్‌ఘర్ వద్ద చెట్టు మీద పడడంతో దెబ్బతిన్న వాహనం

మోరిగావ్ జిల్లాలోని దిఘల్‌బోరిలో ఆటోపై చెట్టు విరిగిపడింది. అందులో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల కళాశాల విద్యార్థి కౌసిక్ బోర్డోలోయ్ ఆంఫీ మరణించాడు. అదే వాహనంలో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. సోనిత్‌పూర్ జిల్లా ధేకియాజులిలో స్కూల్ బస్సుపై చెట్టు కూలడంతో 12 మంది చిన్నారులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కరీంగంజ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వరదలు సంభవించాయి. అప్రమత్తంగా ఉండాలని అధికార యత్నాంగం సూచించింది. తూర్పు బంగ్లాదేశ్‌పై తూర్పు-ఈశాన్య దిశగా గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోన్న తుఫాను బుధవారం రాత్రికి బలహీనపడే అవకాశం ఉంది.

Read More
Next Story