మణిపూర్: బీరెన్ సింగ్ సర్కార్ ఉంటుందా? ఊడుతుందా?
x

మణిపూర్: బీరెన్ సింగ్ సర్కార్ ఉంటుందా? ఊడుతుందా?

సొంత ఎమ్మెల్యేల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎం


చాలాకాలంగా అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్ ఇప్పుడు మరో కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం పై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. దాదాపుగా ప్రభుత్వం కూలిపోతుందనే వదంతలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అసమ్మతి స్వరాల నేపథ్యంలోనే ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి బీరెన్ సింగ్ సర్కార్ సమాయత్తం అవుతోంది.

బీజేపీకి చెందిన 19 మంది మెయితీ శాసన సభ్యులు తిరుగుబావుటా ఎగరవేసి బీరెన్ సింగ్ సర్కార్ కు ఎదురుతిరగడంతో ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దాంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఇష్టం లేక తప్పించుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీరేన్ సింగ్ సర్కార్ కు ప్రస్తుతం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్ధతు ఇస్తున్నారని, ఇందులో బీజేపీకి చెందిన 8 మంది తో పాటు, నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) కు చెందిన 5 మంది, జేడీ(యూ) కు చెంది ఒకరు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలు వాయిదాలు..
60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి 2022 లో ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీకి 32 సీట్లు దక్కాయి. ఆ తరువాత ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. అలాగే ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ సభ్యులలో ఐదుగురు ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపారు. ఆ పార్టీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఇలా సంకీర్ణ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.
తరువాత హైకోర్టు తీర్పుతో అక్కడ చెలరేగిన జాతుల సంక్షోభంతో మెయితీ వర్గం ప్రజలు బీరెన్ సింగ్ సర్కార్ పై ఆగ్రహం తో ఉన్నారు. కుకీ తీవ్రవాదులు, హిందూ మెయితీలపై దాడులు చేస్తున్న బీరెన్ సింగ్ సర్కార్ పట్టించుకోవట్లేదని వారి అభియోగం.
ఈ విషయంపై గత ఏడాది అక్టోబర్ లో 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ పరిణామం తరువాత అక్కడ రాజకీయ సమీకరణం మొత్తం మారిపోయింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. అలా అని లేఖ విషయాన్ని ఖండించలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఎన్పీపీ కూడా తన మద్దతను ప్రభుత్వానికి ఉపసంహరించుకుంది. అందుకే శీతాకాల సమావేశాలు డిసెంబర్ లో నిర్వహించాల్సి ఉన్నా, ప్రభుత్వం దాన్ని తప్పించుకోవడానికే ఫిబ్రవరిలో సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతోందని ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది కూడా ఇలానే..
మణిపూర్ అసెంబ్లీ సమావేశాల విధివిధానాలు, బిజినెస్ అడ్వైజరీ నియామాల ప్రకారం విధిగా సంవత్సరానికి మూడు సార్లు జరపాలి. సాంప్రదాయకంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో జూలై- ఆగష్టు, డిసెంబర్ లో జరుగుతుంటాయి.
అయితే ఇందుకు విరుద్ధంగా గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి 5 రోజుల, జూలై 31 నుంచి ఓ తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇలా గత ఏడాది కేవలం రెండు సార్లు మాత్రమే సమావేశాలు జరిపారు.
సమావేశాలు ఎన్నిసార్లు జరపాలనే విషయంలో భారత రాజ్యాంగం మౌనంగా ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 174 ప్రకారం రెండు సమావేశాల మధ్య కాలం ఆరునెలలకు మించకూడదు. సభ నిర్వహించాల్సి ఉంటే 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే జనవరి 28 న లోపు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది.
మణిపూర్ ప్రభుత్వం చివరగా ఆగష్టులో శాసన సభ సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు సమావేశాలు జరగకపోతే అసెంబ్లీ సస్పెండ్ యానిమేషన్ లోకి వెళ్లిపోతుంది.
బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా? లేరా?
ప్రభుత్వానికి బడ్జెట్ పై మీద నియంత్రణ ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించి వాటికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బీజేపీ నాయకత్వం ఇప్పుడు లాబీయింగ్ ను ప్రారంభించింది. బీరేన్ సింగ్, అతని మద్ధతుదారులు అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే మద్దతు ఉపసంహరించిన ఎన్పీపీనీ కూడా చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఏడుగురు సభ్యులు కూడా పార్టీ అధినాయకత్వం నిర్ణయంతో విబేధించడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
స్పీకర్ సీఎం పదవిని ఆశిస్తున్నాడా?
బీజేపీలోనే ఉన్న కొన్ని వర్గాల ప్రకారం.. స్పీకర్ తోక్ చోమ్ సత్యబ్రత సింగ్ బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నారని వినికిడి. ఆయన గత నెలలో రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కాబట్టి అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆయన నాయకుడిగా ఉన్నారని మణిపూర్ వర్గాల మాట.
అగర్తాలలో గత నెలలో జరిగిన నార్త్ ఈస్ట్ ప్లీనరీ మీట్ లో కూడా అమిత్ షా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. సీఎం సన్నిహిత వర్గాలు కూడా ఈ మాటను బలపరిచాయి. కానీ స్పీకర్ మాత్రం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవన్నీ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్ధేశంగా భావిస్తున్నారు.
గవర్నర్ తో కాంగ్రెస్ నేతల భేటీ..
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న తరుణంలోనే కాంగ్రెస్ నేత కొత్త గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాజ్యాంగం సంక్షోభం నివారించాలంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఇబోబీసింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కే. మేఘచంద్ర, లోక్ సభ సభ్యుడు అంగోమ్చా బిమోల్ అకోయిజం వంటి వారు ఉన్నారు.
తదుపరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కుకీ శాసన సభ్యులు కూడా హజరయ్యేలా చూడాలని కూడా వారు కోరుకుంటున్నారు. జాతుల సంక్షోభం తలెత్తిన దగ్గర నుంచి కుకీ ఎమ్మెల్యేలు భద్రతాకారణాలు చూపి సభకు హజరవ్వడం లేదు.
అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఐదుగురు సభ్యులున్నారు. మణిపూర్ లో జరగుతున్న పరిస్థితులపై రాష్ట్ర పీసీసీ చీఫ్ ‘ ది ఫెడరల్ ’ తో మాట్లాడారు. ‘‘ బీజేపీ శాసనసభా పక్షంలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో పార్టీ విఫలమైంది.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను బహిరంగం విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అందుకే సమావేశాన్ని నిర్వహించడం లేదు’’ అన్నారు. గతంలో ఇలాగే బీరేన్ సింగ్ సర్కార్ అనేక తిరుగుబాటులను ఎదుర్కొని వాటిని సమర్థవంతంగా పరిష్కరించగలిగారు. మరీ ఇప్పుడు ఎలా వాటిని ఎదుర్కొంటారో చూడాలి.
Read More
Next Story