
ఇక నుంచి హిందుయేతరులకు ‘నో ఎంట్రీ’..
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో హిందువులు కానివారు ప్రవేశించకుండా త్వరలో తీర్మానం : BKTC
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని బద్రీనాథ్(Badrinath), కేదార్‌నాథ్(Kedarnath) ఆలయాల్లోకి హిందుయేతరులకు మున్ముందు ప్రవేశం ఉండదు. త్వరలోనే దీనిపై తీర్మానం చేయనున్నట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఆదివారం (జనవరి 25) పేర్కొంది. BKTC పరిధిలోని 45 దేవాలయాలలోకి హిందువులు కానివారిని అనుమతించరు.
‘‘హిందూ ధర్మ పరిరక్షణే కోసమే..’’
హిందూ మత, సంప్రదాయాల పరిరక్షణే కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు, BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది పేర్కొన్నారు. హిందువులు కాని వారిని అనుమతించకపోవడం బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల సంప్రదాయమని, కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు దీన్ని ఉల్లంఘించాయని ద్వివేది ఆరోపించారు.
‘‘సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ..’’
కాగా ఈ చర్యను ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబడుతోంది. బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. "ఈ దేవాలయాల్లోకి హిందువులు కానివారు ఎలాగూ ప్రవేశించరు. అలాంటప్పుడు అధికారిక నిషేధం అవసరమే లేదు. వారు (బీజేపీ) రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నారు" అని ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మానా అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కోరడంతో..
కేదార్‌నాథ్ దేవాలయాలలోకి హిందువులు కానివారు ప్రవేశించకుండా నిషేధం విధించాలని గత సంవత్సరం కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజక బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ బద్రీనాథ్ కోరారు. హిందువులు కానివారు కొన్ని కార్యకలాపాలలో పాల్గొని కేదార్‌నాథ్ పవిత్రను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు.
శీతాకాలం కావడంతో మూసివేసిన బద్రీనాథ్ ఆలయం ఆరు నెలల తర్వాత ఏప్రిల్ 23న తిరిగి తెరుచుకోనుంది.

