
బీహార్ ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారే..
ప్రకటించిన పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్..ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంందని ఆశాభావం..
బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (Nitish Kumar) కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని (Nayab Singh Saini) చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇంతకు ఆయన ఏమన్నారంటే..
సోమవారం హర్యానాలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘‘బీహార్‌లో బీజేపీ విజయయాత్ర కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంలో అది సాధ్యం’’ అని హర్యానా సీఎం సైని పేర్కొన్నారు. ఈ తర్వాత రోజే జేడీ(యూ) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేసింది. నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి జనతాదళ్ (యునైటెడ్) మంగళవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై పాలక కూటమికి మరో ఆలోచన కూడా లేదని పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ పేర్కొన్నారు.
"బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయి. ఆయనే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి. 2030 వరకు పనిచేస్తారు," అని ప్రసాద్ అన్నారు.
ఇండియా కూటమి సీఎం అభ్యర్థి గురించి చెబుతూ..
‘‘ఆర్జేడీ (RJD) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)ను ప్రకటించింది. అయితే ఇండియా కూటమి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో తేజస్వి గతంలో సమావేశమయ్యారు. కాని ఆయనకు హామీ ఇచ్చినట్లు లేదు’’ అని ప్రసాద్ పేర్కొన్నారు.