
బీజేపీ చీఫ్‌గా నబిన్.. మోదీ–షా వ్యూహాంలో భాగమా?
నితిన్ నబిన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, మోదీ–షా రాజకీయ వ్యూహం, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర, బీజేపీ అంతర్గత శక్తి సమీకరణాలపై కొత్త చర్చను రేపుతోంది.
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబిన్ (Nitin Nabin) నియామకం పార్టీ చరిత్రలో కేవలం తరాల మార్పుగా కాకుండా.. మోదీ(PM Modi)–షా(Amit Shah) జంట పార్టీపై తమ పట్టును మరింత బిగింగేందుకు తీసుకున్న నిర్ణయంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే ఆర్‌ఎస్‌ఎస్(RSS)కు దూరం కాకుండా ఉండేందుకు తీసుకున్న నిర్ణయం వెనుక.. పార్టీపై పూర్తి నియంత్రణ సాధించాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
నబిన్ ఎంపిక లాంఛనప్రాయమేనా?
అమిత్ షా గత ఏడాది అక్టోబర్‌లో పాట్నాలో నబిన్ నివాసాన్ని సందర్శించినప్పుడే దాదాపు ఆయన ఎంపిక ఖాయమైందని రాజకీయ వర్గాలు భావించాయి. అప్పట్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవిపై చర్చ జరిగినా.. న్యూఢిల్లీ స్థాయి పాత్రే నబిన్‌కు దక్కుతుందన్న అప్పుడే సంకేతాలు వచ్చాయి.
నమ్మకమే అర్హత?
నబిన్ ఎంపికకు ప్రధాన అర్హత ఆయన శక్తి సామర్థ్యాల కంటే మోదీ–షాలకు ఆయనపై ఉన్న నమ్మకమేనని పార్టీ పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ కో-ఇన్‌చార్జ్‌గా సక్సెస్‌ఫుల్ రోల్ పోషించడం, బీహార్ ఎన్నికల్లో మోదీ ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించడం నితిన్‌కు కలిసోచ్చాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం..
ఆర్‌ఎస్‌ఎస్‌తో నబిన్‌కు ఉన్న అనుబంధం కూడా ఆయన ఎంపికకు సహకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలకు మోదీ–సంఘ్ మధ్య విభేదాలే కారణమని చాలా మంది విశ్లేషకుల మాట.
ఈ నేపథ్యంలో నబిన్ ఎంపిక ఆర్‌ఎస్‌ఎస్‌ను మళ్లీ దగ్గర తీసుకునే ప్రయత్నంగా చూడవచ్చని కొందరి అభిప్రాయపడుతున్నారు. “తమ వ్యక్తి” బీజేపీ అగ్రస్థానంలో ఉండాలన్న ఆకాంక్ష కూడా నితిన్ నియామకంతో పూర్తయినట్లు కనిపిస్తుంది. బయటకు సంఘ్ పరివార్ ప్రభావం పెరిగినట్టు కనిపిస్తున్నా.. నిజానికి పార్టీపై మోదీ–షాల పట్టు మరింత బలపడుతుందన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తుంది.
సామాజిక సమీకరణల ప్రశ్న..
బీహార్ నుంచి ఉన్నత సామాజిక వర్గం కాయస్థ నుంచి నబిన్‌ను ఎంపిక చేయడం వెనుకబడిన వర్గాలకు చేరువ కావాలన్న బీజేపీ వ్యూహానికి విరుద్ధమని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను మరింత ఏకీకృతం చేసే ప్రయత్నమే తప్ప.. కొత్త సామాజిక వర్గాలను చేరువయ్యేందుకు దోహదపడదన్న వాదన వినిపిస్తోంది.
నితిన్ నబిన్ నియామకం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే కీలక మలుపు. ఇది నిజంగా యువతకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పడానికి తీసుకున్న నిర్ణయమా? లేక పార్టీపై మోదీ–షాల ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసే వ్యూహమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
నితిన్ గురించి క్లుప్తంగా..
పాట్నాలోని బీఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన నబిన్.. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు పూర్తిచేయలేకపోయారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006 నుంచి బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నబిన్ కుటుంబానికి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉంది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు.

