Nitin Gadkari | ప్రధాని కావాలనే ఆకాంక్ష లేదు..
బీజేపీలో ఎవరూ తనను ఉన్నత పదవి చేపట్టాలని అడగలేదని, కాబట్టి ఆ ప్రశ్న తలెత్తదని అన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ.
ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇటీవలి ది ఎకనామిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో ఎవరూ తనను ఉన్నత పదవి చేపట్టాలని అడగలేదని, కాబట్టి ఆ ప్రశ్న తలెత్తదని అన్నారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు గడ్కరీ.
"నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. నా పని నేను చేస్తున్నాను. నాకు ప్రధాని కావాలనే ఆకాంక్ష, ఆశయం లేదు. ఆ పదవి చేపట్టాలని ఎవరూ నన్ను అడగరు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు.” అని గడ్కరీ లండన్ ఆధారిత వారపత్రికతో అన్నారు. అదే పత్రికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారసులలో గడ్కరీ ఒకరని ఒక కథనం ప్రచురితమైంది.
గడ్కరీ ఇప్పుడు “మిస్టర్ మోదీ తర్వాత వచ్చే అభ్యర్థులలో ఒకరు. మోదీకి అత్యంత సన్నిహిత వ్యాపార మిత్రుడు గౌతమ్ అదానీపై అమెరికన్ ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణల నేపథ్యంలో గడ్కరీకి అవకాశాలు పెరిగాయి” అని ఆ పత్రికలో రాసుకొచ్చారు. “కానీ మిస్టర్ మోదీ వారసుడిని బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నత స్థాయి శ్రేణులు నిర్ణయిస్తాయి. ఒపీనియన్ పోల్స్ ద్వారా కాదు” అని కూడా పేర్కొన్నారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ ఇలా చెప్పారు. ‘‘నేను ఎవరి పేరు చెప్పను. మీరు ప్రధానమంత్రి కావాలన్న కోరిక ఉంటే మేము మీకు మద్దతు ఇస్తాం.’’ అన్నారు. అయితే ‘‘మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి? అని నేను అడిగాను. ప్రధాని కావాలనేది నా జీవితంలో లక్ష్యం కాదు. నేను నా సంస్థకు విధేయుడి.” అని పేర్కొన్నారు గడ్కరీ.