ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం..
నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. కౌన్సిల్‌లో అందరు ముఖ్యమంత్రులు, గవర్నర్లు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. కౌన్సిల్‌లో అందరు ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, సహకారాన్ని పెంపొందించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడం కూడా ఈ సమావేశం లక్ష్యం. వికసిత్ భారత్-2047 అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన 3వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సు సిఫార్సులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఐదు కీలక అంశాలు..
సమావేశంలో తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్యతో పాటు భూమి,ఆస్తి అనే ఐదు కీలక అంశాలపై సిఫార్సులు చేస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరం అయిన 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్‌కు సహాయపడే విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు.
సమావేశానికి హాజరుకాని నితీష్..
కాగా నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హాజరుకాలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రం తరుపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారని తెలిపారు. కీలక సమావేశానికి కుమార్ గైర్హాజరు కావడానికి కారణం తెలియరాలేదు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా సీఎం సమావేశానికి హాజరు కాలేదు. బీహార్ నుంచి అప్పటి డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా డీసీఎంలు ఇద్దరూ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు.
"ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్న బీహార్‌కు చెందిన నలుగురు కేంద్ర మంత్రులు సమావేశానికి హాజరవుతారని" అని జెడి(యు) అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు.