
‘పార్టీ లైన్‌ను ఎప్పుడూ ఉల్లంఘించలేదు’
ఆపరేషన్ సిందూర్ వైఖరికి క్షమాపణ చెప్పను: ఎంపీ శశి థరూర్
తాను ఎప్పుడూ పార్టీ వైఖరికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్(Congress) ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) స్పష్టం వేశారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో మాత్రమే తాను భిన్నంగా ఆలోచించానని, అది పార్టీపై తిరుగుబాటు కాదన్నారు. దేశ భద్రత, ఉగ్రవాదంపై చర్యల విషయంలో తన అభిప్రాయం సరైనదేనని భావిస్తున్నానని..అందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్‌తో థరూర్‌కు విభేదాలున్నాయా?
కేరళలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, పొత్తులపై చర్చించేందుకు నిన్న (జనవరి 23)న పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి థరూర్ హాజరుకాలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల ఉన్న అసంతృప్తి కారణంగానే ఆయన సమావేశానికి హాజరుకాలేదని వార్తలొచ్చాయి. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో థరూర్ పేరును రాహుల్ ప్రస్తావించలేదని అందుకు మీటింగ్‌కు థరూర్ హాజరకాలేదని పార్టీ కార్యకర్త ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజేతలను సత్కరించడానికి జరిగిన 'మహా పంచాయతీ' కార్యక్రమానికి మాత్రం థరూర్ హాజరయ్యారు.
KLFకు వెళ్తున్నందువల్లే..
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కోసం కోజికోడ్‌లో ఉన్న కారణంగా సమావేశానికి శశిథరూర్ హాజరు కాలేకపోయారని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ముందుగానే తెలియజేశామని థరూర్ కార్యాలయం స్పష్టం చేసింది. తన తాజా పుస్తకం ‘‘శ్రీ నారాయణ గురు’’ పై ప్రసంగం ఉండటమే కారణమని పేర్కొంది. తన అభిప్రాయాలను మీడియా ద్వారా కాకుండా పార్టీ నాయకత్వానికి నేరుగా తెలియజేస్తానని థరూర్ చెప్పినట్లు కార్యాలయం వెల్లడించింది. మీడియా కథనాల్లో కొన్ని నిజమైతే, మరికొన్ని అసత్యాలని కూడా పేర్కొంది.

