NEET ప్రశ్నపత్రం లీకయ్యింది.. విచారణలో ఒప్పుకున్న విద్యార్థి
x

NEET ప్రశ్నపత్రం లీకయ్యింది.. విచారణలో ఒప్పుకున్న విద్యార్థి

NEET 2024 ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమే. పోలీసుల విచారణలో అనుమానితులు ఈ విషయాన్ని అంగీకరించారు.


NEET 2024 ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమే. పోలీసుల విచారణలో అనుమానితులు ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రశ్నపత్రం లీక్ అయిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

బీహార్‌లో పేపర్ లీక్..

బీహార్‌లో ప్రశ్నపత్రం లీకైందని పోలీసులు కనిపెట్టారు. ఇప్పటికే వారు కొందరిని అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురిలో నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్, అతని మామ సికందర్ ప్రసాద్ యాదవెందు, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ఉన్నారు. నితీష్, అమిత్ నుంచి యాదవెందు ప్రశ్నపత్రాన్నిసంపాదించాడని సమాచారం.

‘‘పరీక్షకు ముందు రోజు నా మేనమామ నుంచి నాతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు ప్రశ్నపత్రాన్నితీసుకున్నారు. పరీక్ష తర్వాత పోలీసులు వచ్చి నన్ను ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాను’’ అని అనురాగ్ యాదవ్ చెప్పారు.

'ఏ పేపరైనా లీక్ చేస్తాం’

‘ఏ పోటీ పరీక్ష ప్రశ్నపత్రానయినా లీక్ చేస్తాం. NEET పేపర్ కావాలనుకున్న వారి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 32లక్షలు వసూలు చేస్తాం..అని నితీష్, అమిత్ నాతో చెప్పారని అనురాగ్ యాదవ్ మామ యాదవెందు పోలీసులకు చెప్పారు. యాదవెందు దానాపూర్ మునిసిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు.

ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు..

నీట్ పరీక్ష రాసే ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసినట్లు యాదవెందు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. పరీక్ష ముగిసిన మరుసటి రోజు.. వాహన తనిఖీలో విద్యార్థుల అడ్మిట్ కార్డులను యాదవెందు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నివేదిక కోరిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ?

ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం (జూన్ 19) బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నుండి నివేదిక కోరినట్లు సమాచారం. నివేదిక అందాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి సహాయకుడి హస్తం?

ఇంతలో బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రశ్నాపత్రం లీకేజీ వెనక RJD నాయకుడు తేజస్వి యాదవ్ సహాయకుడు ప్రీతం కుమార్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ఆయన బీహార్ రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ (ఆర్‌సిడి)లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఫోన్ చేసి యాదవెందు కోసం ఒక రూం బుక్ చేయమని చెప్పాడని సిన్హా ఆరోపణ.

పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాకు తన మేనల్లుడు అనురాగ్ యాదవ్, అతని తల్లితో పాటు ఇతర వ్యక్తులు వెళ్లారని యాదవెందు పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం యాదవెందు జైలులో ఉన్నారు.

‘‘పేపర్ లిక్ ప్రభుత్వం’’

యుజిసి-నెట్‌ను రద్దు చేసిన వెంటనే కాంగ్రెస్ బుధవారం (జూన్ 19) మోదీ ప్రభుత్వాన్ని "పేపర్ లీక్ ప్రభుత్వం" అని అభివర్ణించింది. ఇప్పుడు విద్యా మంత్రి బాధ్యత తీసుకుంటారా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మెడికల్ ప్రవేశ పరీక్ష (నీట్‌)లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి “నీట్ పరీక్షా పే చర్చ” ఎప్పుడు నిర్వహిస్తారని వ్యంగ్యంగా అడిగారు.

Read More
Next Story