యువ దౌత్యవేత్తల గురువు నట్వర్ సింగ్..
x

యువ దౌత్యవేత్తల గురువు నట్వర్ సింగ్..

కేంద్ర మాజీ మంత్రి కె నట్వర్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.


కేంద్ర మాజీ మంత్రి కె నట్వర్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 93 సంవత్సరాల నట్వర్ సింగ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో 1931లో జన్మించిన నట్వర్‌ సింగ్‌ దౌత్యం, రాజకీయం, రచన రంగాల్లో తనదైన ముద్రవేశారు. కాంగ్రెస్‌ పార్టీతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది.

దౌత్యంలో అపార అనుభవం..

1953లో నట్వర్‌సింగ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాని 1984లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 1985లో ఉక్కు, బొగ్గు, గనులు, వ్యవసాయ శాఖల్లో సహాయమంత్రిగా పనిచేశారు. 1986లో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా వ్యవహరించారు. కొంత కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇరాకీ ‘ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌ ప్రోగ్రాం’ ఒప్పందంలో వ్యక్తిగత లబ్ధి పొందారన్న ఆరోపణలతో 18 నెలల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు స్వీకరించారు.

యువ దౌత్యవేత్తలకు గురువు..

యువ దౌత్యవేత్తలు నట్వర్ సింగ్‌ను గొప్ప గురువుగా చెబుతుంటారు. చైనా, అమెరికా, పాకిస్థాన్‌, యూకేలో భారత్‌ తరఫున కీలక పదవుల్లో పనిచేశారు. 1983లో దిల్లీలో జరిగిన నాన్‌-అలైన్డ్‌ ఏడో శిఖరాగ్ర సదస్సుకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్‌ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి ప్రధాన స్వమన్వయకర్తగా ఉన్నారు. విదేశాంగ శాఖలో 1982-1984 మధ్య కార్యదర్శిగా పనిచేశారు. 1984లో ఆయన్ని ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. దౌత్యరంగంలో ఉన్న అపార అనుభవమే రాజకీయాల్లో ఆయనకు ఎంతగానో ఉపయోగపడిందని అంటుంటారు.

రాజవంశ కుటుంబీకుడు..

నట్వర్‌ సింగ్‌ అప్పటి భరత్‌పూర్‌ స్వతంత్ర రాజ్యంలో జన్మించారు. జాట్ హిందువులైన వీరు భరత్‌పూర్‌ రాజవంశ కుటుంబీకులు. అజ్మేర్‌లోని మయో కాలేజ్‌, గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో విద్యనభ్యసించారు. దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనేక అంశాల్లో విస్తృతమైన అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన్ని సన్నిహితులు కొనియాడుతుంటారు. గొప్ప చతురత కలిగిన దౌత్యవేత్తగా అభివర్ణిస్తుంటారు.

రచనలు..

‘ది లెగసీ ఆఫ్‌ నెహ్రూ: ఏ మెమోరియల్‌ ట్రిబ్యూట్‌’, ‘మై చైనా డైరీ 1956-88’ పేరిట నట్వర్‌ సింగ్‌ ప్రముఖ రచనలు చేశారు. ‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ పేరిట ఆత్మకథ రశారు.

Read More
Next Story