
SIR భయాలు.. ముస్లిం ఓటర్లలో కలవరం..
మైనారిటీ ఓట్లు చీలితే.. బెంగాల్ రాజకీయ సమీకరణ మారుతుందా?
పశ్చిమ బెంగాల్(West Bengal)లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లలో ఆందోళన మొదలైంది. ఓటరు జాబితా సవరణ (S.I.R) ప్రక్రియపై అనిశ్చితి, స్పష్టత లేకపోవడంతో ఓటు హక్కు కోల్పోతామనే భయం మైనారిటీ వర్గాలను వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ముస్లిం సమాజం ఓటింగ్‌పై ప్రభావం చూపడమే కాకుండా, మొత్తం బెంగాల్ ఎన్నికల లెక్కల్ని కూడా మార్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముస్లిం మద్దతు బీజేపీ వద్దనుకుందా?
అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఈసారి ముస్లిం ఓట్లపై ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తుంది. అక్రమ వలసలు, ఓటర్ల జాబితా సమగ్రత వంటి అంశాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ(BJP).. దాదాపు 70 శాతం ఉన్న హిందూ ఓటర్ల మద్దతును ఏకీకృతం చేసే దిశగా వ్యూహా రచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా అక్రమ వలసదారులు ఓటరు జాబితాలోకి వచ్చారని, వారిని తొలగించేందుకే S.I.R అవసరమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు అధికారిక గణాంకాలు ఇప్పటివరకు మద్దతు ఇవ్వలేదు.
సువేందు వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవల పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి(Suvendu Adhikari) చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. “బెంగాల్‌లో సబ్కా సాథ్, సబ్కా వికాస్ అవసరం లేదు. ఎందుకంటే ముస్లింలు సాధారణంగా బీజేపీకి ఓటు వేయరు” అని ఆయన అన్నారు. అలాగే అక్రమ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రక్రియను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి.
SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుంచి కోటి మందికి పైగా అక్రమ ముస్లిం వలసదారులను తొలగిస్తామని ఆయనతో సహా పలువురు బీజేపీ నేతలు పదే పదే పేర్కొంటున్నారు.
SIRతో మైనారిటీల్లో ఆందోళన..
ఈ వ్యాఖ్యలు ముస్లిం వర్గాల్లో ఓటు హక్కు కోల్పోతారనే భయాలను మరింత పెంచాయి. ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చకులియా వంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో S.I.Rకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల అవి హింసాత్మకంగా మారాయి.
ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓటర్లు టీఎంసీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కాంగ్రెస్(Congress) నేత రణజిత్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. SIR అంశం టీఎంసీ–బీజేపీ మధ్య ద్వంద్వ పోటీని మరింత బలపరచేందుకు ఉపయోగపడుతోందని కాంగ్రెస్, CPI(M) ఆరోపిస్తున్నాయి.
SIR కారణంగా ముస్లిం ఓట్లు ఏకీకృతమైతే, టీఎంసీకి అది తాత్కాలికంగా ఊరటనిచ్చే అంశంగా మారవచ్చు. అయితే గతంలో మైనారిటీ మెజారిటీ నియోజకవర్గాల్లో 90 శాతం వరకు ఓట్లు సాధించిన టీఎంసీ ఆధిపత్యం ఇకపై అంత సులభంగా కొనసాగదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంలో ముస్లిం ఓటర్లు..
రాష్ట్రంలో OBC వర్గీకరణ మార్పులు ముస్లిం ఓటర్లలో అసంతృప్తిని పెంచాయి. దీంతో టీఎంసీకి ప్రత్యామ్నాయంగా కొత్త నాయకులు, పార్టీలు ముందుకు వస్తున్నాయి. మాజీ టీఎంసీ నేత హుమాయున్ కబీర్ జనతా ఉనయన్ పార్టీ ద్వారా ముస్లిం రాజకీయ ఆశయాలకు ప్రతినిధిగా ఎదుగుతున్నారు. ముర్షిదాబాద్ ప్రాంతంలో కొంత ప్రభావం ఉన్నప్పటికీ, గతంలో బీజేపీకి దగ్గరగా ఉన్నారన్న ఆరోపణలు ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
దక్షిణ బెంగాల్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) కార్యకలాపాలు పెంచుతోంది. మాల్డా, పరిసర జిల్లాల్లో కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి గని ఖాన్ చౌదరి మేనకోడలు మౌసమ్ నూర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి ఊపొచ్చింది.
AIMIM విస్తరణ యత్నాలు..
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM కూడా ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో తన పట్టు పెంచుతోంది. 2021లో ఆరు స్థానాల్లో పోటీ చేసిన AIMIM, 2026లో దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ఉర్దూ మాట్లాడే ముస్లింలు, యువతలో AIMIM కొంత మద్దతు సాధించినప్పటికీ, గ్రామీణ బెంగాలీ ముస్లింలలో దాని ప్రభావం పరిమితంగానే ఉంది.
ముర్షిదాబాద్‌లోని షంషేర్‌గంజ్, బెల్దంగా వంటి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్న మత, రాజకీయ విభజనలను ప్రతిబింబిస్తున్నాయని పౌర సమాజ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనలు కేవలం మత ఘర్షణలు కాకుండా రాజకీయ ప్రేరేపితమని నిజనిర్ధారణ బృందాలు వ్యాఖ్యానించాయి.
2026 ఎన్నికలపై ఈ పరిణామాల ప్రభావం ఇంకా పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ముస్లిం ఓట్లు చీలితే బీజేపీకి అది పరోక్షంగా లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
“మైనారిటీ ఓట్లు చీలిపోతే, బీజేపీకి ముస్లిం ఓట్లు అవసరం లేకుండానే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టీఎంసీకి అసలు సవాలు ఇకపై ఓట్లు సమీకరించడం కాదు, వాటిని నిలుపుకోవడమే.” అని కోల్‌కతాకు చెందిన రాజకీయ విశ్లేషకురాలు నిర్మాల్య బెనర్జీ పేర్కొన్నారు.

